ఏడు రకాల సన్న ధాన్యానికే బోనస్ : తేల్చిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం సన్న ధాన్యానికి బోనస్‌ను 33 రకాల నుంచి 7 రకాలకే పరిమితం చేసింది. దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jun 18, 2026, 1:29 pm IST
Read Time: 5 mins
ఏడు రకాల సన్న ధాన్యానికే బోనస్ : తేల్చిన ప్రభుత్వం

సన్న రకం ధాన్యాలకు సంబంధించి బోనస్ చెల్లింపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గతంలో 33 రకాల సన్నలకు బోనస్ ఇస్తామని అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం….ఇప్పుడు ఆ జాబితాను ఏడు రకాలకు కుదించింది. ఇప్పుడు కేవలం బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), కేఎ న్ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ది), కేఎన్ఎం-7715, జై శ్రీరామ్, హెచ్ఎంటీ సోనా రకం వడ్లకే బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ధాన్యం పరిమాణం పెద్దగా ఉందని, మిల్లింగ్ లో నూక, అన్నం మెత్తగా ఉండటం, త్వరగా పాడైపోతుండటం వంటి కారణాలతో సన్నల సాగు జాబితా నుంచి మిగతా సన్న రకం ధాన్యం రకాలను తొలగించినట్లుగా పేర్కొంది. ఏడు రకాల సన్న ధాన్యం పంటలను 38.19లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. నిరుడు కంటే 10.31లక్ష్యల ఎకరాల సాగు లక్ష్యాన్ని ప్రభుత్వం పెంచడం గమనార్హం. ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు రకాల సన్న ధాన్యం విత్తనాలను సబ్సీడిపై అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

అవి సాగు చేస్తే…దిగుబడి తగ్గుతుందని రైతుల ఆందోళన

ప్రభుత్వం బోనస్ ఇస్తామంటున్న 7 రకాల సన్న ధాన్యం సాగు చేస్తే ఎకరానికి 10 క్వింటాళ్ల మేరకు దిగుబడి నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంటే ఒక్కో రైతుకు ఎకరాలకు రూ. 24 వేల దిగుబడి తగ్గే అవకాశం ఉందంటున్నారు. 33 రకాల వడ్లలో ప్రభుత్వం గుర్తిస్తున్న 7 రకాల వడ్లు ఎకరాకి 20 క్వింటాళ్లు పండితే మిగతా 26 రకాలు మాత్రం ఎకరాకు 30 క్వింటాళ్లు పండుతాయని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో దశాబ్దాలుగా చిట్టి ముత్యాలు అనే వరి రకంతో పాటు, కావేరి, జెయింట్ బీపీటీ, నెల్లూరు సన్నాలు లాంటి వడ్ల రకాలు పండించే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్న అక్కడి రైతులు వాపోతున్నారు. 2023 ఎన్నికల ముందు పండించిన ప్రతీ పంటకు బోనస్ ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక 33రకాల సన్నలకు బోనస్ ఇస్తామని చెప్పి..ఇప్పుడు దాన్ని కేవలం ఏడు రకాల సన్న వడ్లకే పరిమితం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. రైతు బీమా పథకాన్ని ఎగ్గొట్టడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడంతో 7600 మంది చనిపోయిన రైతులకు రైతు బీమా డబ్బులు రాలేదు అని ఆరోపించారు. రైతు భరోసా సైతం నామమాత్రం చేసి కోతలు పెడుతుందని విమర్శించారు.