Jagitial Municipal Elections : ఇద్దరు కలిసి బీఆర్ఎస్ ను నలిపేశారు..జగిత్యాలలో రెబెల్స్ హవా
జగిత్యాల మున్సిపాలిటీలో జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ పోటాపోటీ ప్రచారంతో బీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ. కాంగ్రెస్ 23, స్వతంత్రులు 15 వార్డుల్లో విజయం.
జగిత్యాల మున్సిపాలిటీలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రెబెల్ నేత టీ.జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మకునూరు సంజయ్ కుమార్ లు పోటాపోటీగా ప్రచారం చేసి బీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బకొట్టారు. వీరిద్దరి దెబ్బకు బీఆర్ఎస్ పార్టీ కోలుకోని విధంగా దెబ్బతిన్నది. ఈ మున్సిపాల్టీలో మొత్తం 50 వార్డులు ఉండగా కాంగ్రెస్ అభ్యర్థులు 23 చోట్ల విజయం సాధించగా, స్వతంత్రులు 15 చోట్ల గెలుపొందారు. స్వతంత్రుల్లో కూడా వీరిద్దరి వర్గానికి చెందిన వారు ఉండడం విశేషం. బీఆర్ఎస్ నాలుగు స్థానాలు సాధించగా, ఈ పార్టీ కన్నా రెండు స్థానాలు అధికంగా అంటే ఆరింట్లో బీజేపీ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేశారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మజ్లీస్ పార్టీ కూడా రెండు స్థానాల్లో ఆధిక్యత సాధించింది.
జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి వరుసగా రెండుసార్లు గెలుపొందారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ రావడం, అప్పటికే మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె దేవనపల్లి కవిత వైఖరితో విసిగి వేసారి ఉన్నా ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ప్రకటించారు. నియోజకవర్గం డెవలప్ మెంట్ కోసం గెలిచిన పార్టీకి గుడ్ బై చెప్పారు. 2023లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన సీనియర్ నాయకుడు టీ.జీవన్ రెడ్డి మాజీ అయ్యారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరి మధ్య కొద్ది నెలలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా రాజకీయాలు నడుస్తున్నారు. ఒకరంటే ఒకరికి గిట్టని విధంగా నియోజకర్గంలో వ్యవహరిస్తున్నారు. జగిత్యాల మున్సిపాల్టీ ఎన్నికల వేళ ఇద్దరు ప్రత్యర్థులుగా మారి తమ అభ్యర్థులను గెలిపించుకుని బీఆర్ఎస్ పార్టీని గట్టిగా దెబ్బకొట్టారు. జగిత్యాల మున్సిపాల్టీలో మొత్తం 50 వార్డులు ఉండగా కాంగ్రెస్ 23, స్వతంత్రులు 15, బీజేపీ 6, బీఆర్ఎస్ 4, మజ్లిస్ పార్టీ 2 చోట్ల గెలుపొందాయి. అయితే ఇక్కడ అనేక ట్వీస్టులు ఉన్నాయి. మొత్తం 50 వార్డులలో సంజయ్ కుమార్ వర్గీయులకు 30 వార్డులు, జీవన్ రెడ్డి వర్గీయులకు 20 వార్డులు కేటాయిస్తూ కాంగ్రెస్ నాయకత్వం బీ పామ్ లను అందచేసింది. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు అయిన తననే అవమానపరుస్తారా అంటూ రాష్ట్ర పార్టీ నాయకత్వంపై జీవన్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. సంజయ్ కుమార్ కు కేటాయించిన 30 డివిజన్లలో తన వర్గానికి చెందిన వారిని రెబెల్ గా బరిలోకి దింపారు. తనకు కేటాయించిన బీ పామ్ లలో 15 మందికి మాత్రమే బీ పారాలు ఇచ్చి, ఐదుగురికి ఇవ్వకుండా వదిలేశారు. అంటే మొత్తం 45 మంది వరకు తన వర్గంవారిని బరిలోకి దింపారు. అయితే ఇంకో విచిత్రం ఏమంటే బీపామ్ ఇచ్చిన 15 వార్డులలో ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. కాంగ్రెస్ వద్దూ అంటూ ఆయన రెబెల్ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించారు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనకు అప్పగించిన 30 వార్డులతో పాటు మరో 19 వార్డులలో కూడా ఆయన కలియతిరిగి ప్రచారం చేశారు. ఈ 19 వార్డులలో జీవన్ రెడ్డి బీపామ్ లు ఇచ్చిన 15 మంది ఉండడం విశేషం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ బీపామ్ లు ఇచ్చిన వారందరి గెలుపు కోసం నిరంతరం శ్రమించారు.
50 వార్డుల్లో రెండు కాంగ్రెస్ లు 23 గెలిచాయి
మొత్తం 50 వార్డులకు 45 వార్డులలో బీపామ్ తీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు 23 మంది గెలిచారు. ఇందులో జీవన్ రెడ్డి 15 బీఫామ్ లు ఇవ్వగా 9 మంది, సంజయ్ కుమార్ 30 బీపామ్ లు ఇవ్వగా 14 మంది విజయం సాధించారు. ఇది కాకుండా స్వతంత్రులుగా గెలిచిన వారిలో ఇద్దరి వర్గానికి చెందిన వారు ఉన్నారు. స్వతంత్రుల్లో 9 మంది జీవన్ రెడ్డి వర్గం కాగా నలుగురు సంజయ్ వర్గీయులు ఉన్నారు. అంటే జీవన్ రెడ్డి మొత్తంగా 18 మందిని, సంజయ్ 19 మందిని గెలిపించుకుని బీఆర్ఎస్ పార్టీని మట్టి కరిపించారు. నువ్వా నేనా అనే విధంగా ఇద్దరు పోటీపడి ప్రచారం చేసి తమ వర్గం వారినే గెలిపించుకోవడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో బహిర్గతంగా కలహించుకుంటారు కాని ఎన్నికల విషయానికి వచ్చేసరికి తమ అభ్యర్థులకు ఏమాత్రం నష్టం జరగని విధంగా గెలిపించుకుంటారనేది జగిత్యాల మున్సిపాల్టీ ఎన్నికలు ఉదాహారణగా చెప్పుకోవాలి. రెండు వర్గాలు చేతులు కలిపితే మెజారిటీ 37 అవుతుందని, సునాయసంగా మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకుంటాయంటున్నారు. మరో విచిత్రమేమంటే బీజేపీ రెబెల్స్ ముగ్గురు విజయం సాధించారు.
దేవనపల్లి కవిత వైఖరితో విసిగిన సంజయ్
నిజామాబాద్ మాజీ ఎంపీ దేవనపల్లి కవిత వైఖరి కారణంగా జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. పదేళ్ల పాలనలో తన వర్గాన్ని పెంచి పోషించడం, సంజయ్ కుమార్ కు నిరంతరం అడ్డుపుల్లలు వేయడం పనిగా పెట్టుకున్నదని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. సంజయ్ ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ నోరు మెదకుండా మౌనంగా భరించారంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సన్నిహితంగా ఉంటున్నారు. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఆయన రాకను వ్యతిరేకించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి ఏమాత్రం ఖాతరు చేయకుండా సంజయ్ కు అండగా ఉంటున్నారు. 2018, 2023లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ కుమార్ తన సమీప ప్రత్యర్థి టీ.జీవన్ రెడ్డి పై గెలుపొందారు.
ఇవి కూడా చదవండి :
Komatireddy Rajagopal Reddy| మంత్రి పదవి ఇవ్వకపోతే.. సీఎం పదవే లాక్కుంటా: రాజగోపాల్ రెడ్డి
OTT Movies | వాలెంటైన్స్ వీక్ తర్వాత ఓటీటీల్లో మూవీ మేళా.. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాల జాబితా
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram