Thermobaric Bombs | ఆ బాంబు పేలితే.. మనిషి క్షణాల్లో బూడిదే.. ! గాజాలో ఆనవాళ్లు!

ఆ బాంబు పేలితే.. గరిష్ఠంగా మూడు వేల డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతతో ఫైర్‌ బాల్‌ ఏర్పడుతుంది. అందులో చిక్కుకున్న మనుషులు.. ఆ వేడి తీవ్రతకు ‘ఆవిరి’ అయిపోతారు. అదే.. థర్మోబాంబు! ఇప్పుడు గాజాలో అటువంటి బాంబులు ప్రయోగించారన్న వార్త ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తున్నది.

Thermobaric Bombs | ఆ బాంబు పేలితే.. మనిషి క్షణాల్లో బూడిదే.. ! గాజాలో ఆనవాళ్లు!

Thermobaric Bombs | తూటాలు పేల్చితే.. బుల్లెట్లు దిగబడి మనిషి చనిపోతాడు. బాంబులు పేల్చితే అందులోని లోహపు ముక్కలు మనిషి శరీరాన్ని ఛిద్రం చేస్తాయి. మరి మనిషి ఆనవాళ్లు కూడా లభించకుండా చంపేసే బాంబు ఉంటే? ఉంది. గాజాపై ఇజ్రాయెల్‌ సాగిస్తున్న అమానుష యుద్ధకాండలో ధర్మోబారిక్‌ బాంబును వినియోగిస్తున్నారన్న వార్త.. ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్ని. వాస్తవానికి ఈ బాంబు వినియోగాన్ని నిషేధించారు. అయినా.. గాజా పౌరులపై ఈ బాంబు ప్రయోగించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

2023 అక్టోబర్‌ నుంచి 2,842 మంది అదృశ్యమయ్యారని గాజా పౌర యుద్ధ బృందాలు నమోదు చేసినట్టు అల్‌ జజీరా ఒక పరిశోధనాత్మక కథన్నాన్ని పబ్లిష్‌ చేసింది. ఈ పరిశోధన ప్రకారం.. బాంబు దాడులు జరిగిన ప్రాంతాల్లో జాడ తెలియకుండా పోయినవారి వివరాలను మెథడ్‌ ఆఫ్‌ ఎలిమినేషన్‌ ప్రాతిపదికన రికార్డు చేశారు.

‘దాడికి గురైన ఒక ఇంట్లోకి మేం వెళ్లాం. అక్కడ అంతకు ముందు నివసించిన వ్యక్తుల సంఖ్యతో పోల్చితే మాకు మృతదేహాలు/శరీర భాగాలు తక్కువ దొరికాయి. ఆ ఇంట్లో ఐదుగురు వ్యక్తులు ఉండాల్సింది. కానీ.. మూడు శవాలను మాత్రమే మేం కనుగొన్నాం. మరో ఇద్దరి జాడ తెలియలేదు. అయితే.. తీవ్రంగా శోధించిన తర్వాత గోడలపై వారి రక్తపు మరకలు, శరీర భాగాలకు సంబంధించిన చిన్నచిన్న భాగాలు లభ్యమయ్యాయి’ అని గాజా సివిల్‌ డిఫెన్స్‌ ప్రతినిధి బసాల్‌ చెప్పారు.

ఏమిటీ థర్మోబారిక్‌ లేదా వ్యాక్యూం బాంబులు?

థర్మోబారిక్‌ లేదా వ్యాక్యూం బాంబులు.. సాధారణ బాంబుల కంటే భిన్నంగా పనిచేస్తాయి. వీటినే ఫ్యూయల్‌ ఎయిర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ అని కూడా పిలుస్తారు. ఈ బాంబు రెండు దశల్లో పేలుతుంది. ముందుగా గాలిలో ఇంధన కణాలను వ్యాపింపచేస్తుంది. ఆ తర్వాతి పేలుడు సంభవించి.. భారీ అగ్నిగోళం, వ్యాక్యూమ్‌ ఏర్పడతాయి. ఆ సమయంలో మంటల తీవ్రత 2500 నుంచి 3500 డిగ్రీల సెల్షియస్‌ వరకూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ టైమ్‌లో వెలువడే అధిక ఉష్ణ్రోగ్రత, ఒత్తిఇ, ఆక్సిడేషన్‌ ప్రభావంతో మానవ శరీర కణజాలం క్షణాల్లో దగ్ధమై… బూడిదగా మారిపోతుందన్నమాట.

గాజాలో వాడినవి అవేనా?

గాజాలో ఉపయోగించిన ధర్మోబారిక్‌ బాంబుల్లో MK-84 ‘హ్యామర్‌’, BLU-109 బంకర్‌ బస్టర్‌, GBU-39 ప్రిసిషన్‌ బాంబులు ఉండి ఉండొచ్చని పరిశోధనాత్మక కథనం ప్రకారం తెలుస్తున్నది. వీటిలో ఎంకే –84 హ్యామర్‌ బాంబు.. ట్రైటోనల్‌ మిశ్రమంతో నింపిన భారీ అన్‌గైడెడ్‌ బాంబు. ఇక బీఎల్‌యూ–109 అనేది బంకర్‌ బస్టర్‌. అంటే.. భూమిలోకి చొచ్చుకుపోయిన తర్వాత పేలుతుంది. ఇక జీబీయూ–39 అనేది.. ప్రిసిషన్‌ బాంబు. ఈ బాంబు ఓక భవంతిలో ప్రయోగిస్తే దాని నిర్మాణానికి పెద్దగా నష్టం, ధ్వంసం ఏమీ ఉండవు. కానీ.. అది సృష్టించే ఒత్తిడి, ఉష్ణ తరంగాలతో లోపలి వ్యక్తులను మాడ్చి.. మసి చేస్తుంది. గాజాలోని అల్‌ టాబిన్‌ పాఠశాలపై దాడి ప్రదేశంలో జీబీయూ–39 బాంబు భాగాలు లభించాయని కథనాలు పేర్కొంటున్నాయి.

ఈ ఆయుధాలు మనుషులను చంపడమే కాదని.. మనిషి ఆనవాళ్లు లేకుండా తుడిచిపెట్టేస్తాయని రష్యా మిలిటరీ నిపుణుడు వసిలీ ఫాటిగరోవ్‌ను అల్‌ జజీరా ఉటంకించింది. మంటల కాలాన్ని పొడిగించేందుకు అల్యూమినియం పౌడర్లు, మెగ్నీషియం, టైటానియంను రసాయనిక మిశ్రమంలో కలుపుతారని ఆయన తెలిపారు. ఫలితంగా మంటల తీవ్రత 2.500 డిగ్రీల సెల్షియస్‌ నుంచి 3వేలడిగ్రీల సెల్షియస్‌ వరకు ఏర్పడుతుందని చెప్పారు. టీఎన్‌టీ, అల్యూమినిం పౌడర్‌ మిశ్రమాన్ని ట్రిటోనల్‌ అంటారు. ఎంకే–84 వంటి అమెరికా తయారీ ఆయుధాల్లో దీనినే తరచూ వినియోగిస్తుంటారు.

వంద డిగ్రీల సెల్సియస్‌ వద్ద నీరు ఆవిరిగా మారడం మొదలవుతుందని పాలస్తీనా ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మునిర్‌ అల్‌ బుర్ష్‌ చెప్పారు. శరీరం తీవ్రమైన ఒత్తిడి, ఆక్సిడేషన్‌తోపాటు 3వేల డిగ్రీలకు మించిన వేడికి గురైనప్పుడు శరీరంలోని ద్రవాలు తక్షణమే మరిగిపోతాయని ఆయన తెలిపారు. ఆ వెంటనే శరీర కణజాలం సైతం ఆవిరైపోయి.. బూడిద మిగులుతుందని ఆయన వివరించారు.

ఇటువంటి ఆయుధాలను బ్లాస్ట్‌ ప్రాంత పరిధిని పెంచేందుకు ఉపయోగిస్తారు. సంప్రదాయ పేలుడు పదార్థాల్లో ఉపయోగించే లోహపు ముక్కల బదులు.. ఇవి మంటలను వ్యాప్తిచేస్తాయి. వాస్తవానికి ఈ బాంబులను ఉపయోగించడాన్ని అంతర్జాతీయ మానవతా చట్టాలు వ్యతిరేకిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

World Environment Day | ‘పర్యావరణం’పై యుద్ధం..! ఇప్పటికీ రావణకాష్టంలా రగులుతూనే ఉన్న గాజానే ఉదాహ‌ర‌ణ‌..!!
Airport Cafe | ఇక నుండి ఎయిర్ పోర్టుల్లో టీ రూ.10, సమోసా రూ.20 అంతే!