Gaza Peace Plan explained | రెండేండ్ల జినోసైడ్ తర్వాత మొదటి దశ శాంతి ఒప్పందం : గాజా పీస్‌ డీల్‌పై ఇఫ్టూ ప్రసాద్‌ సమగ్ర విశ్లేషణ

ఇజ్రాయెల్‌, గాజా యుద్ధంపై కుదిరిన శాంతి ఒప్పందం గురించి ఐఎఫ్‌టీయూ నేత పీ ప్రసాద్‌ సమగ్ర విశ్లేషణ

Gaza Peace Plan explained | రెండేండ్ల జినోసైడ్ తర్వాత మొదటి దశ శాంతి ఒప్పందం : గాజా పీస్‌ డీల్‌పై ఇఫ్టూ ప్రసాద్‌ సమగ్ర విశ్లేషణ

Gaza Peace Plan explained | రోజూ గాజా బాంబింగ్, భీభత్సం, మరణాలు, నెత్తుటి మడుగులు, శవాల కుప్పలు, ఆకలి కేకలు, వికలాంగుల దృశ్యాలు చూడలేక తల్లడిల్లిపోయే ప్రపంచ ప్రజలకు ఊరట పొందే ఒక వార్త! అదే జినోసైడ్ నిలిచిపోతుందనే ఆశ కలిగింది.

రెండేండ్ల రెండు రోజుల నరమేధం (జినోసైడ్) తర్వాత గాజా పై శాంతి ఒప్పందం కుదిరింది. ఇది ట్రంప్ శాంతి ప్రణాళికలో భాగంగా ఈజిప్ట్, ఖతార్, టర్కి మధ్యవర్తిత్వంలో భారత కాలమాన ప్రకారం ఈ తెల్లవారు ఝామున కుదిరింది. పెద్ద రియల్ ఎస్టేటర్ ఐన అల్లుడికి గాజాను వినోద్ కేంద్రంగా అప్పగించే ట్రంప్ లక్ష్యం తెల్సిందే! అది ఇటీవల యుద్ధం తీవ్రం కావడానికి అదనపు కారణం. అదే అల్లుణ్ణి తమ అమెరికా తరపున ప్రతినిధివర్గంలో సభ్యునిగా పంపడం గమనార్హం. తన అల్లుడి అమ్యూజ్‌మెంటు పార్కు కోసం ఏ గాజా కబ్జాకి కుట్ర పన్నాడో, అది బెడిసికొట్టాక దిగి వచ్చి చేసుకోవాల్సిన శాంతి ఒప్పంద చర్చల్లో తిరిగి అదే అల్లుణ్ణి ఒక జెంటిల్మన్ ని చేయడం ఓ గొప్ప దౌత్యనీతియే.

ట్రంప్ శాంతి ప్రణాళికలో తొలిదశగా చెబుతున్న ఒప్పందమిది. తాజా వార్తల ప్రకారం మరో రెండు దశలు వుండొచ్చు. తాజా యుద్ధ విరమణ ఒప్పందంలో నాలుగు అంశాలున్నట్లు ప్రాథమిక వార్తల్ని బట్టి తెలుస్తోంది.

1-మొత్తం 48 మంది బంధీలను (సజీవ అండ్ నిర్జీవ) హమాస్ విడుదల చేయడం!

1-యావజ్జీవ శిక్షపడ్డ 250 మందితో సహా రెండు వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయల్ ప్రభుత్వం జైళ్ళ నుండి విడుదల చేయడం!

3-తక్షణమే గాజాకు మానవతా సాయం అందించడం.

4-ఇజ్రాయల్ తన సైన్యాన్ని గాజా నుండి ఉపసంహారణ చేయడం!
(ఇది తక్షణమే 70% అని తెలుస్తున్నది)

వారం క్రితం ట్రంప్ ప్రకటించిన సోకాల్డ్ 20 సూత్రాల శాంతి ప్రణాళిక హమాస్ నిరాయుధీకరణ అంశానికి ప్రాధాన్యత ఇచ్చింది. దాన్ని హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది.

హమాస్ ఆయుధాలను వదిలేసి నిరాయుధం కావాలనే ట్రంప్ షరతు పట్ల నెతన్యాహు సర్కార్ గట్టి మద్దతు ఇచ్చింది. ఆ డిమాండ్ లేకుండా తాజా ఒప్పందం కుదిరింది. ఇది ప్రత్యేక గమనార్హ విశేషం!

2023 నవంబర్, 2024 జూన్ లలో రెండుసార్లు, ట్రంప్ ప్రమాణ స్వీకారం ముందు 2025 జనవరి లో మూడోసారి శాంతి ఒప్పందాలు కుదిరాయి. ఇజ్రాయల్ ఉల్లంఘనతో భగ్నమయ్యాయి. తాజా ఒప్పందం కార్యరూపం ధరిస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేము. భవిష్యత్తు చెప్పాల్సి వుంది.

అమెరికాపై ఆధారపడి రాజకీయ మనుగడ సాగించే అరబ్ దేశాల పై పాలస్తీనా జాతి నమ్మకం కోల్పోయింది. తొలిసారి తమ విమోచన కోసం స్వతంత్ర ప్రతిఘటనా పంథా చేపట్టింది. డెబ్భై వేలమంది మరణించినా, లక్షన్నర మందికి పైగా గాయపడ్డా, అంతిమ విజయం పట్ల విశ్వాసం సడలలేదు. వర్తమాన ప్రపంచంలో ప్రతిఘటనా పోరాటాలకు పాలస్తీనా జాతి, ముఖ్యంగా గాజా దారిదీపమైనది.

పాలస్తీనా జాతి విముక్తి మార్గం సుదీర్ఘమైనది. సంక్లిష్టమైన ఆ దుర్భేద్య దారిలో శిఖర మెట్టుకు చేరడానికి అనేక మెట్లు దాటాలి. తాజా ఒప్పందం ఓ కీలక మెట్టు కావాలని ఆశిద్దాం.

కేవలం 365 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల గాజాలో మూడున్నర లక్షలసేన 720 రోజులుగా దాడులు చేస్తున్నది. ఒక చదరపు కిలో మీటర్ కి వెయ్యు సైనికులు వేట సాగించడం గమనార్హం. ఇది ప్రపంచ చరిత్రలో మున్నెన్నడూ జరగని బీభత్సకాండ!

గాజా జనాభాలో ప్రతి ఏడుగురుకో సైనికుడంటే ఊహించుకోవచ్చు. గాజా సగటు కుటుంబ సభ్యుల సంఖ్య అంతకన్న ఒకింత ఎక్కువే. కుటుంబానికో సైనికుడనమాట! అంటే ఆ ఒక్కొక్క కుటుంబంలో పిల్లలు, స్త్రీలు, వృద్దులు ఒక్కొక్కరైనా వుంటారు. ఆ వేట ఎంతటి భీభత్స రూపంలో ఉంటుందో అంచనా వేయవచ్చు. అయినా నేటికీ తన బందీలను విడుదల చేయలేక పోయింది. హమాస్ నిర్మూలన చేయలేక పోయింది. హమాస్ ని గాజా ప్రజల నుండి ఏకాకిని చేయలేక పోయింది.

గాజా వదిలి వెళ్లే వారికి దారి కల్పిస్తామని గత సెప్టెంబర్ లో మరోసారి ఇజ్రాయల్ విమానాల నుండి అరబ్ భాషలో ముద్రించిన కరపత్రాలు విసిరింది. మాతృదేశం విడిచి వెళ్లే ప్రసక్తే లేదని 22 లక్షల ప్రజలు ఒకే మాట మీద నిలబడ్డారు. ఒక్కరంటే ఒక్కరైనా ప్రాణం మీద తీపితో గాజా వీడలేదు. గాజాను తన అల్లుడికి అప్పగించే ట్రంప్ ప్లాన్ కి అవకాశం ఇవ్వలేదు. ఆయనే చర్చల్లో కూర్చొని తన పై బురద మాపుకోవడానికి శాంతి దూత వేషాన్ని ధరించాల్సి వచ్చింది. శాంతి ఒప్పందం ఎలా అమలు జరుగుతుందో రేపటి విషయం. నేడు ఏం జరిగిందో ఇంకో మాట!

గాజా పట్ల ప్రపంచం మౌనంగా లేదు. గాజా కోసం వర్తమాన ప్రపంచం మండుతోంది. ఈ మండే ప్రపంచానికి ఫ్లోటిల్లా ఓ ఉత్ప్రేరకంగా మారింది. ఇలా మండే ప్రపంచాన్ని చల్లార్చకాపోతే కొన్ని యూరప్ రాజ్యాలతో పాటు కొన్ని అరబ్ దేశాల ప్రభుత్వాలు తమతమ దేశాల ప్రజల చేతుల్లో కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రజలను చల్లార్చాల్సిన అవసరం అనివార్యంగా ఆధిపత్య ప్రపంచానికి ఏర్పడింది. ఈ స్థల, కాలాలకి లోబడి ఒప్పంధాన్ని చూడాలి.

ఈ శాంతి ఒప్పందాన్ని చూపించి తన చిరకాల వాంఛ నోబుల్ ప్రైజ్ ట్రంప్ కి ఇస్తే ఇవ్వొచ్చు. కానీ సామ్రాజ్యవాద, దురాక్రమణదారీ ముద్ర నోబుల్ బహుమతితో చెరిగిపోదు.

ఇకనైనా గాజాలో శాంతి ఏర్పడాలని ఆశిద్దాం. ఆ ప్రజలకు బాంబు శబ్దాలు వినబడని, మరణాలు కనబడని వాతావరణం ఏర్పడాలని ఆశిద్దాం. ఇక సోషల్ మీడియాలో గాజా విషాదదృశ్యాలు చూడని పరిస్థితి వస్తుందని కూడా ఆశిద్దాం.

తమ విమోచన కోసం పాలస్తీనా ప్రజల వీరోచిత వారసత్వ చరిత్రకు, మరీ ముఖ్యంగా గాజా ప్రజల అశేష, విశేష, అనన్య, అపూర్వ, అసాధారణ త్యాగాలను ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన సందర్బమిది. వారిని అభినందించే కొన్ని వాక్యాలను ఈ ఉదయం హమాస్ విడుదల చేసిన ప్రెస్ నోట్ నుండి ఈ క్రింద ఉదహరిస్తున్నాను.

‘గాజా, జెరూసలేం, వెస్ట్ బ్యాంకుల్లోని మా పాలస్తీనా ప్రజల దృఢ దీక్షని అభినందిస్తోంది. వారిని ఖాళీ చేయించే లక్ష్యంతో సాగించిన దురాక్రమణల కుట్రల మధ్య ప్రదర్శించిన వారి ధైర్యస్థైర్యాలు, అంకితభావం గొప్పవి. మా పాలస్తీనా ప్రజల్ని లొంగదీసుకోవడానికి, నిర్వాసితుల్ని చేయడానికి జరిగిన పథకాల్ని త్రిప్పికొట్టారు. మా ప్రజల అశేష త్యాగాలు వృథా కావు. మా ప్రజలు కోరుకునే స్వేచ్ఛ,  స్వాతంత్య్ర సాధన కోసం హమాస్ నిలబడుతుందని నొక్కి చెబుతున్నాం’.

పి ప్రసాద్ (పిపి)
9-10-2025