లీటర్ నీటితో 500కిలో మీటర్ల బైక్..పెట్రోల్ కొరతకు చెక్ పడేనా?

తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శంకర్ గౌడ్ 1 లీటర్ నీటితో 500 కిలోమీటర్లు నడిచే బైక్ ను తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. నీటితో హైడ్రోజన్ ను ఉత్పత్తిని చేయడం ద్వారా నడిచే బైక్ ను తయారు చేసి వెహికల్ ఇంజనీరింగ్ లో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jul 10, 2026, 5:35 pm IST
Read Time: 7 mins
లీటర్ నీటితో 500కిలో మీటర్ల బైక్..పెట్రోల్ కొరతకు చెక్ పడేనా?

ఇప్పటిదాకా పెట్రోల్, ఎలక్ట్రికల్, సీఎన్జీ, ఎల్పీజీ గ్యాస్ ఆధారంగా నడిచే వాహనాలను మనం చూశాం. ఇప్పుడొక ఔత్సాహిక పరిశోధకుడు నీటితో నడిచే బైక్ ను తయారు చేసి సంచలనం రేపాడు. అది కూడా తెలంగాణ వాసి కావడం విశేషం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శంకర్ గౌడ్ 1 లీటర్ నీటితో 500 కిలోమీటర్లు నడిచే బైక్ ను తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. నీటితో  హైడ్రోజన్ ను ఉత్పత్తిని చేయడం ద్వారా బైక్ ను తయారు చేసి…వెహికల్ ఇంజనీరింగ్ లో  సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గతంలో సీఎన్జీతో బైక్ నడిపే విధానాన్ని కనిపెట్టి స్వయంగా ఆచరించి చూపిన శంకర్ గౌడ్ కొత్తగా నీటితో నడిచే బైక్ ప్రత్యేక ఇంజిన్‌ను సృష్టించాడు.ఇందులో హైడ్రోజన్, ఆక్సిజన్ విభజన టెక్నాలజీ (Hydrogen and Oxygen Separation) పనిచేస్తుంది. ఇందులో సోడియం హైడ్రాక్సిడ్ 5గ్రాములను నీటిలో కలుపుతారు. దీనివల్ల 1 లీటర్ నీటితో ఏకంగా 500 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని, అంతేగాక సైలెన్సర్ నుంచి బయటకు వచ్చే పొగ పూర్తిగా స్వచ్చమైన ఆక్సిజన్ కావడంతో పర్యావరణ సమస్యలు కూడా ఉండవని శంకర్ చెప్పుకొచ్చాడు. ఈ బైక్ 30శాతం గ్యాస్, 70శాతం నీటితో నడుస్తుందన్నారు. ఎలాంటి బ్లాస్ట్ సమస్యలు ఉండవని స్పష్టం చేశారు.

ఒక లీటర్ నీటితో తన బైక్ ద్వారా 500కిలో మీటర్లు ప్రయాణించవచ్చని, గరిష్ట వేగం 100కు పైగా దూసుకపోవచ్చని, రాకెట్లలో వినియోగించే హైడ్రోజన్ ద్వారానే ఈ బైక్ నడుస్తున్నందునా ఎంత వేగంలోనైనా వెళ్లవచ్చని వివరించారు. బండి బ్యాటరీ ద్వారా 12వోల్టేజ్ విద్యుత్ ఆటోమెటిక్ బైక్ ఇంజన్ కు అందిస్తుందని వెల్లడించారు. నీరు, హైడ్రోజన్ తో బైక్ తయారు చేయడానికి 35వేల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రస్తుతం వినియోగిస్తున్న కిట్ సాంకేతికతకు ఏడాది గ్యారంటీ మాత్రమే ఇవ్వగలనని, హెచ్ హెచ్ వో కిట్ దేశంలో దొరికితే ఎన్నేళ్లయినా బైక్ ను వినియోగించవచ్చని తెలిపారు. శంకర్ గౌడ రూపొందించిన నీటి ఆధారిత హైడ్రోజన్ బైక్ ప్రయోగం విజయవంతమైతే దేశం ఎదుర్కొంటున్న పెట్రోల్ సమస్యకు భారీ ప్రత్యామ్నయం దక్కవచ్చు.

నీటితో నడిచే జాయ్ ఈ బైక్ సూపర్ స్కూటర్

ఇప్పటికే దేశంలో నీటితో నడిచే క్రేజీ స్కూటర్ తీసుకొచ్చే ప్రయత్నం విజయవంతమైంది. జాయ్ ఇ-బైక్ సరికొత్త నీటితో నడిచే హైడ్రోజన్ స్కూటర్ ప్రోటోటైప్‌ను తెచ్చింది. డిస్టిల్డ్ వాటర్‌తో ఇది 55 కిమీ మైలేజ్ ఇస్తుంది. ప్రముఖ టూవీలర్ బ్రాండ్ జాయ్ ఈ బైక్ సరికొత్త టెక్నాలజీతో నీటి ద్వారా నడిచే ఒక అద్భుతమైన స్కూటర్ ప్రోటోటైప్‌ను మన ముందుకు తెచ్చింది. భవిష్యత్తులో కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించడమే లక్ష్యంగా ఈ వినూత్న ప్రయోగాన్ని చేశారు.టెస్టులన్నీ పూర్తయ్యాక త్వరలోనే మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది.

అసలు నీటితో స్కూటర్ ఎలా నడుస్తుంది?

చాలామందికి నీళ్లతో బైక్ నడవడం ఏంటి అనే డౌట్ రావచ్చు.ఇందులో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని వాడారు. మనం పోసే డిస్టిల్డ్ వాటర్ అంటే కల్తీ లేని స్వచ్ఛమైన నీటి నుంచి హైడ్రోజన్ మాలిక్యూల్స్‌ను ఈ సరికొత్త టెక్నాలజీ వేరు చేస్తుంది. అలా సేకరించిన హైడ్రోజన్ ద్వారా ఫ్యూయల్ సెల్స్ విద్యుత్‌ను తయారు చేస్తాయి. ఆ కరెంట్‌తోనే స్కూటర్ మోటార్ రన్ అవుతుంది. అంటే దీని వల్ల ఎలాంటి హానికరమైన పొగ గానీ, కర్బన ఉద్గారాలు గానీ రావు. పర్యావరణానికి ఇది వంద శాతం సేఫ్ అని కంపెనీ పెర్కొంటోంది.ఈ స్కూటర్ గరిష్ఠంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే, ఒక్కసారి హైడ్రోజన్ ఇంధనాన్ని నింపితే చాలు.. ఏకంగా 55 కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రయాణించవచ్చు. సిటీలో చిన్న చిన్న పనులకు, ఆఫీసులకు వెళ్లేవారికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ కానుంది.దీనికి సైకిల్‌లాగా పెడల్స్ కూడా అమర్చడంతో సైకిల్ మాదిరిగా తొక్కుకుంటూ వెళ్లవచ్చు.