తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు టీవీకే పార్టీ కరూర్ ల నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాటలో మృతి చ చెందిన బాధిత కుటుంబాలకు సీఎం విజయ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. తొక్కిసలాట మృతుల కుటుంబాలను అప్పట్లో వర్చువల్ గా పరామర్శించిన సందర్భంలో విజయ్ అప్పట్లోనే బాధితుల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.20లక్షలు జమ చేశారు. తన పార్టీ అధికారంలోకి వచ్చాక కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు మృతుల కుటుంబాల్లోని ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను సీఎం విజయ్ శుక్రవారం పంపిణీ చేశారు. విజయ్ కరూర్ బయలుదేరి వెళ్లి బాధిత కుటుంబాలను కలుసుకొని వారికి ఈ పత్రాలు అందజేశారు.
కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాల్లోని ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్న సీఎం విజయ్ నిర్ణయాన్ని స్టే చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయంలో తప్పేం లేదని పేర్కొంటూ కోర్టు సీఎం విజయ్ నిర్ణయాన్ని సమర్థించడం ఈ సందర్బంగా గమనార్హం.
కరూర్ తొక్కిసలాట కచ్చితంగా కుట్రనే
కరూర్ తొక్కిసలాట ఘటన కచ్చితంగా రాజకీయ కుట్రేనని ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి ఆరోపించారు. ఆ రోజు ర్యాలీకి ఎక్కువ మంది వచ్చారని తెలిసినా.. పోలీసులు మధ్యలోనే ర్యాలీని ఎద్దుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. సీఎం హోదాలో తొలిసారి కరూర్‌లో పర్యటించిన విజయ్ నాటి ఘటనను గుర్తుచేసుకుంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. కరూర్ విషాదాన్ని తానెప్పటికీ మర్చిపోలేనని, మృతుల జ్ఞాపకార్థం పార్టీ తరఫున స్మారకాన్ని నిర్మిస్తానని సీఎం వెల్లడించారు. ఒక మనిషి ఉన్నత శిఖరాలను అధిరోహించినా సరే.. తన జీవితంలో ఎక్కడో ఓ చోట బాధాకరమైన క్షణాలను ఎదుర్కోక తప్పదనొ, నా రాజకీయ ప్రయాణంలో కరూర్ ఘటన అలాంటిదేనని ఆవేదన చెందారు. ఆ తొక్కిసలాటలో ఎంతోమంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయారని, దీనికి బాధ్యులెవరు? అని ప్రశ్నించారు.
నేను పోలీసులను నమ్మాను..వారు నాపై నిందలేశారు
ఆ రోజు ర్యాలీకి రద్దీ ఎక్కువగా ఉందని పోలీసులకు అనిపించినప్పుడు మమ్మల్ని అలర్ట్ చేయాల్సిందని, లేదా సమావేశాన్ని రద్దు చేయాల్సిందని, అందుకు వారికి అన్ని అధికారాలు ఉన్నప్పటికిని..అలా చేయకుండా వారు చోద్యం చూసిన ఫలితమే తొక్కిసలాట దుర్ఘటన అని వ్యాఖ్యానించారు .
ఆనాటి ప్రభుత్వం ఒత్తిడికి పోలీసులు గురై చోద్యం చూసి ఉంటారని, రద్దీని నియంత్రించగలరని నేను పోలీసులను నమ్మానని, కానీ, నా వల్లే మరణాలు జరిగాయని నాడు నాపై వారు నిందలేశారని గుర్తు చేశారు. ఈ ఘటన తర్వాత నేను పారిపోయానని ప్రత్యర్థులు నాపై బురదజల్లారని, కానీ, నేను పారిపోలేదు అని, ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని విజయ్ స్పష్టం చేశారు.
నా ప్రభుత్వాన్ని కూల్చలేరు..
ఇటీవల తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన ప్రయత్నాలపై సీఎం విజయ్ ఘాటుగా స్పందించారు. ప్రజలు తనవైపే ఉన్నారని తెలిపారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. తమను అధికారంలో నుంచి దించలేరంటూ డీఎంకే-అన్నాడీఎంకేలపై పరోక్ష విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాయని విజయ్ విమర్శించారు. తమ హయాంలో ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి పేరే వినిపించదని తెలిపారు.