తెలంగాణ గంగా-జమున తెహజీబ్‌కు ప్రతీక హైదరాబాద్ ఆషాడ మాసం బోనాల పండుగ ఉత్సవాలు జూలై 16న గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారికి ఆనవాయితీగా సమర్పించే తొలి బోనంతో ప్రారంభం కానున్నాయని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. భక్తులు సంతోషంగా అమ్మవారిని దర్శించుకుని, నిండు మనసుతో ప్రభుత్వాన్ని దీవించి, సంతృప్తిగా ఇళ్లకు తిరిగి వెళ్లేలా అన్ని ప్రభుత్వ శాఖలు కలసికట్టుగా పని చేయాలని, దైవానికే అంకితమైన శివసత్తులకు బోనాల సమర్పణలో అన్ని శాఖలు సహకరించాలని మంత్రి సూచించారు.
గోల్కొండ కోటలో జరిగిన జగదాంబికా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశంలో అధికారులకు మంత్రి కొండా సురేఖ మార్గనిర్దేశం చేశారు. అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆషాడ బోనాల జాతర పోస్టర్, బ్రోచర్ ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల ఉత్సవాల నిర్వహణ, ముస్లిం పండుగల సందర్భాల్లో హిందూ, ముస్లిం సమాజాల పరస్పర సహకారం, వారు ప్రదర్శించే లౌకిక స్ఫూర్తి యావత్ దేశానికి గొప్ప సందేశాన్ని ఇస్తున్నదని మంత్రి అన్నారు.
జూలై 16న లంగర్ హౌస్ కూడలి నుంచి ప్రారంభమయ్యే అమ్మవారి బోనం సమర్పణ, తొట్టెలు రథం ఊరేగింపు, మెట్ల పూజకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి జూలై 16, 19, 23, 26, 30, ఆగష్టు 2,6,9,13 తేదీల్లో నిర్వహించే ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్, పార్కింగ్, క్యూ లైన్లు, బారికేడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, అగ్నిమాపక, ప్రత్యేక బస్సులు తదితర ఏర్పాట్లు సమగ్రంగా ఉండాలని స్పష్టం చేశారు.
దేవాలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, మొబైల్ టాయిలెట్లు, తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్ సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా గోల్కొండ కోట పరిధిలోని రహదారులు, మెట్లు, విద్యుత్ దీపాలు, హైమాస్ట్ లైట్లు, సూచిక బోర్డులు, షెడ్లు తదితర సౌకర్యాలు ముందుగానే సిద్ధం చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. అలాగే భక్తుల దర్శనం సాఫీగా సాగేందుకు దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని ఆదేశించారు.
బోనాల ఉత్సవాలు కొనసాగినన్ని రోజులు పోలీస్ శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. భక్తుల భద్రత, సౌకర్యాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. అనుమానితుల ఫొటోలతోకూడిన వాల్ పోస్టర్లను ప్రదర్శిస్తూ భక్తులను అప్రమత్తం చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ కాలపరిమితిని నిర్దేశించుకుని పనులు సకాలంలో పూర్తి చేయాలని మంత్రి నిర్దేశించారు. విద్యుత్ శాఖ కరెంటు వైరింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హెచ్చరించారు. పరిశుభ్రత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. చిన్న పిల్లలు, వృద్ధులు గర్భిణీలు బాలింతల విషయంలో అన్ని శాఖలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, పోలీస్, ట్రాఫిక్, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖ, జిహెచ్ఎంసి, ఐ అండ్ పి ఆర్ తదితర శాఖలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.