qatar role ceasefire | ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు ఖతార్ మధ్యవర్తిత్వం!
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్ని ఉన్నప్పటికీ.. వాటి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఖతార్ ముఖ్యభూమిక పోషిస్తున్నది. ఒకవైపు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లడుతుంటే.. మరోవైపు ఇరాన్ నేతలో ఖతార్ సంప్రదింపులు కొనసాగిస్తున్నది.

qatar role ceasefire | ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కోసం ఖతార్ కీలక పాత్ర (qatar role) పోషిస్తున్నది. రెండు దేశాల మధ్య శతృత్వాలను (ceasefire) తాత్కాలికంగా పక్కన పెట్టేందుకు ఇరాన్‌ను ఒప్పించడంలో ఖతార్ ప్రధాని షేక్ ముహమ్మద్ బిన్ అబ్దల్‌రెహమాన్ అల్ థాని కీలకంగా వ్యవహరిస్తున్నారని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఖతార్ నేత మధ్య నేరుగా ఫోన్‌లో సంప్రదింపులు జరిగినట్టు తెలిపింది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఘర్షణాత్మక వాతావరణాన్ని వెంటనే నిలువరించేందుకు ఖతార్ సహాయాన్ని అమెరికా కోరినట్టు తెలుస్తున్నది. ఖతార్‌లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరం అమెరికా సేనల ఆధ్వర్యంలో ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ ఎయిర్‌బేస్‌ను టార్గెట్ చేసిన ఇరాన్ (iran).. ప్రాణనష్టాన్ని నివారించేందుకు ముందుగానే దోహాకు సమాచారం ఇచ్చింది. తన దేశంలోని ఎయిర్‌బేస్‌పై దాడులు జరిపినప్పటికీ ఇరాన్‌తో మధ్యవర్తిత్వానికి ఖతార్ సిద్ధపడటం ఆసక్తికర అంశంగా నిలుస్తున్నది.
ఇజ్రాయెల్ (israel) ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో ట్రంప్ నేరుగా ఫోన్‌లో సంభాషించగా.. మరోవైపు ఆయన టీమ్.. ఖతార్ ద్వారా ఇరాన్‌తో చర్చలు కొనసాగిస్తున్నట్టు అధికారవర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. అమెరికా దాడులు నిర్వహించిన వెంటనే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య చర్చలకు ట్రంప్ సంకల్పించారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘ఇరాన్ వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడండి.. బీబీతో నేను మాట్లాడాలి. మనం శాంతిని నెలకొల్పబోతున్నాం’ అని శనివారం రాత్రి తన బృందానికి ట్రంప్ సూచించారని ఒక కీలక అధికారి వెల్లడించారు.
తమదేశంపై దాడి జరిగినప్పటికీ దోహా ప్రతిదాడులకు పాల్పడలేదు. అయితే.. తమ దేశ గడ్డపై ఉన్న అమెరికా మిలిటరీ బేస్‌పై దాడి విషయంలో ఇరాన్ అంబాసిడర్‌కు దోహా సమన్లు జారీ చేసింది. బయటకు కాల్పుల విరమణ అమెరికా కృషి వల్లేనని చెప్పుకొన్న ట్రంప్.. ఇది సాకారం కావడంలో ఖతార్ కీలక పాత్ర పోషించిందని పేర్కొనడం గమనార్హం. తాజా పరిణామం మధ్య ఆసియాలో విశ్వసనీయమైన మధ్యవర్తిగా ఖతార్‌కు ప్రాచుర్యం తెచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. ఖతార్‌కు అటు అమెరికాతోనూ, ఇటు ఇరాన్‌తో దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయి. ప్రాంతీయ చర్చల వేదికగా నిలిచిన ఖతార్.. హమాస్ నాయకత్వానికి కూడా గతంలో ఆతిథ్యం ఇచ్చింది. ప్రధానమైన ప్రాంతీయ వివాదాల్లో అన్నిపక్షాలతోనూ మాట్లాడగల సామర్థ్యం కలిగిన కొన్ని దేశాల్లో ఒకటిగా ఖతార్ నిలువడం గమనార్హం. ఆఫ్ఘనిస్తాన్ శాంతిచర్చలు మొదలుకుని.. గాజా ప్రాంతానికి మానవతా సహాయాన్ని పంపించడం వరకూ అనేక అంశాల్లో ఖతార్.. తటస్థ మధ్యవర్తిగా పేరు తెచ్చుకున్నది.
ఇరాన్‌తో కాల్పుల విరమణను ట్రంప్ జూన్ 23న ప్రకటించినప్పటికీ.. ఇజ్రాయెల్ టార్గెట్లపై ఇరాన్ సైన్యాలు క్షిపణులు కురిపించాయని వార్తలు వస్తున్నాయి. ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతంలో ప్రజలకు అప్రమత్తత హెచ్చరికల నిమిత్తం సైరన్‌లు మోగించారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తున్న సమయంలో ఇరాన్ దాడి ఏ మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఇది శాంతి కాలమని, కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించినప్పటికీ ఇరాన్ లక్ష్య పెట్టలేదు. తాము సైతం కాల్పుల విరమణకు ఒప్పుకొంటున్నామని, కానీ ఉల్లంఘనలను సహించేది లేదని ఇజ్రాయెల్ కూడా పేర్కొన్నది. అయితే.. తాము కాల్పుల విరమణను ఉల్లంఘించలేదని ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ వర్గాలను ఉటంకిస్తూ ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ స్పష్టంచేసింది.