World Environment Day | ‘పర్యావరణం’పై యుద్ధం..! ఇప్పటికీ రావణకాష్టంలా రగులుతూనే ఉన్న గాజానే ఉదాహరణ..!!
World Environment Day | యుద్ధమంటే ప్రాణ నష్టమేనా? యుద్ధమంటే కొన్ని తరాలు వెంటాడే మానని గాయమేనా? యుద్ధమంటే ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవడమేనా? యుద్ధమంటే కన్నతల్లితో సమానమైన జన్మభూమిని వదిలి మూలవాసులు వలస పోవడమేనా? యుద్ధమంటే ప్రతీకారేచ్ఛాధిపత్యాలు రగిలి మనుషులను భస్మీపటలం చేయడమేనా? భవనాలను కుప్పకూల్చి.. శిథిల రాజ్యాలను సృష్టించడమేనా? అవును.. ఇవన్నీ యుద్ధ ప్రతి‘ఫలాలే’. కానీ.. యుద్ధాలతో మరో ప్రమాదం కూడా ఉన్నది. అది యావత్ ప్రపంచానికి ప్రతికూల ప్రభావాలు కలిగిస్తుంది. ఒక్క ఉదాహరణ ఇప్పటికీ రావణకాష్టంలా రగులుతూనే ఉన్న గాజా!

కర్బన ఉద్గారాల విడుదల కేంద్రంగా గాజా
భారీగా బాంబు దాడులు, విధ్వంసాలు
15 నెలలుగా ఎడతెగని సైనిక ఘర్షణ
శిథిలాల కుప్పలుగా మారిన భూభాగం
ప్రమాదకర స్థాయిలో గ్రీన్‌హౌస్ గ్యాస్
పునర్నిర్మాణంలో అంతకు మించి!
పర్యావరణ కార్యకర్తల ఆందోళన
World Environment Day | న్యూయార్క్ : ఒక ఏడాదిలో సుమారు 36 దేశాలు, భూభాగాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు ఒక్క గాజా ప్రాంతం నుంచే వెలువడ్డాయి. ఇజ్రాయెల్, గాజా మధ్య గత 15 నెలలుగా యుద్ధం కొనసాగుతున్నది. అపారమైన ప్రాణ నష్టం ఇప్పటికే వాటిల్లింది. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఈ యుద్ధం లెక్కకు మించిన స్థాయిలో గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేస్తున్నది. దాన్ని లెక్కిస్తే.. 36 దేశాలు ఒక ఏడాదిలో విడుదల చేసే కర్బన ఉద్గారాలకు మించి ఉన్నాయని ఒక నివేదిక వెల్లడించింది. ‘పర్యావరణంపై యుద్ధం’ పేరిట లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ, లాంకాస్టర్ వర్సిటీ, ఇతరులు ప్రచురించిన అధ్యయనం ఫలితాలు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి. డైరెక్ట్‌గా వార్ ద్వారానే 19 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఈక్వీవలెంట్ (tCO2e)ను విడుదలయ్యాయని నివేదిక పేర్కొన్నది.
యుద్ధం తీవ్రత, అనంతరం గాజా పునర్నిర్మాణం మొత్తం కలుపుకొంటే.. విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ ఈక్వీవలెంట్.. 3.32 కోట్ల టన్నులు ఉంటుంది. అంటే.. అది 102 మోస్తరు దేశాలు ఒక ఏడాదిలో విడుదల చేసే కర్బన ఉద్గారాలతో సమానమని నివేదిక తెలిపింది. యుద్ధం, శాంతి సమయంలో సైనిక ఉద్గారాలపై దృష్టిసారించాల్సిన ఆవశ్యకతను ఈ నివేదిక పట్టిచూపుతున్నదని నివేదిక రచయితలు పేర్కొన్నారు. సోషల్ సైన్స్ రిసెర్చ్ నెట్‌వర్క్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఘర్షణలకు సంబంధించిన ఉద్గారాలను ఈ అధ్యయనం మూడు దశలుగా వర్గీకరించింది. అవి.. ఘర్షణకు ముందు, ఘర్షణ కాలం, ఘర్షణ ముగిశాక పునర్నిర్మాణ కాలం. ఈ మూడు దశలూ సదరు ప్రాంతంలో కర్బన ఉద్గారాలకు దోహదం చేస్తున్నాయి.
ఘర్షణకు ముందు..
గాజా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 2023 అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఆ సమయంలో తొలి బాంబు పేలడానికి చాలాకాలం ముందే ఉద్గారాలు తయారయ్యాయి. హమాస్ సంస్థ భూగర్భంలో నిర్మించిన భారీ సొరంగం, 65 కిలోమీటర్ల పొడవున ఇజ్రాయెల్ ‘ఐరన్ వాల్’ నిర్మాణ సమయాల్లోనే భారీగా కాంక్రీట్, ఇనుము వాడారు. ఇవి రెండూ భారీ స్థాయిలో కార్బన్ ఇన్‌టెన్సివ్ మెటీరియల్స్. రెండు దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణ మొదలు కావడానికి ముందే 5,57,459 టన్నుల టీసీవో2ఈ విడుదలైంది.
ఘర్షణ కాలం : యుద్ధ కాలంలో వెలువడిన tCO2eని 1,898,330.9గా లెక్కించారు. ఇదంతా వైమానిక బాంబు దాడులు, రాకెట్ల వల్లే కాకుండా.. మానవతా సహాయం నిమిత్తం తిరుగాడిన భారీ వాహనాలు సృష్టించిన మొత్తం.
అందులో కీలకమైనవి చూస్తే…
సరుకు రవాణా (ఆకాశ, సముద్రమార్గాల్లో) : 555,777 tCO2e
ఇజ్రాయెల్ వైమానిక, బాంబు దాడులు: 252,490.6 tCO2e
నేలపై తిరిగిన వాహనాలు సృష్టించింది : 47,838.2 tCO2e
ఇజ్రాయెల్ దళాల శతఘ్నులు, బాంబుల ద్వారా : 78,306 tCO2e
హమాస్ ప్రయోగించిన రాకెట్‌ల ద్వారా : 925.9 tCO2e
గాజాలో విద్యుత్ కోసం వినియోగించిన ఇంధనం ద్వారా : 131,791.4 tCO2e
సహాయ ట్రక్కుల డెలివరీలు: 817,436 tCO2e
వీటితోపాటు.. ఇరాన్, లెబనాన్, యెమెన్ దేశాలు భాగస్వాములైన ఘర్షణల్లో మరో 9,474.9 tCO2e విడుదలైంది.
ఘర్షణ తర్వాత..
ఇప్పటిదాకా విడుదలైన కర్బన ఉద్గారాలు ఒక ఎత్తు.. యుద్ధం ముగిసిన తర్వాత చేపట్టే పునర్నిర్మాణ కార్యకలాపాలతో వెలువడే ఉద్గారాలు మరో ఎత్తు. ఈ యుద్ధంలో గాజాలోని 54 నుంచి 66 శాతం భవంతులు దెబ్బతినడమో, ధ్వంసమవడమో జరిగింది. వీటిని, రహదారులు, మౌలిక వసతులు పునర్నిర్మాణం, శిథిలాల తొలగింపు క్రమంలో మరో 29.75 మిలియన్ల tCO2e విడుదలవుతుంది. గాజాలో ఒక్క ఇళ్ల పునర్నిర్మాణానికే 26.86 మిలియన్ tCO2e విడుదలవుతుంది. ఇది.. క్రొయేషియా వంటి దేశం ఒక ఏడాదిలో విడుదల చేసే ఉద్గారాలతో సమానమని నివేదిక తెలిపింది. ప్రపంచ పర్యావరణ లక్ష్యాల్లో ఇటువంటి.. లెక్కించని యుద్ధ కాల ఉద్గారాల విస్తృత ప్రభావం పర్యావరణంపై గణనీయంగా ఉంటుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి యుద్ధాలు, యుద్ధ సన్నాహాలు ప్రపంచ జీహెచ్‌జీ ఉద్గారాల్లో 5.5 శాతం వరకూ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ధరిత్రి వేడెక్కడాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని లక్ష్యాలు పెట్టుకున్నా.. అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు కేటాయించే బడ్జెట్‌లు నానాటికీ తగ్గిపోతున్నాయని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ హెచ్చరికలు చేస్తూనే ఉన్నది. అయినా.. సైనిక సంఘర్షణల కారణంగా వెలువడే ఉద్గారాలపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు పెద్దగా లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. యుద్ధం వద్దు అనేది ఒక్క ప్రాణ, ఆస్తి నష్టాల నివారణకే కాదు.. పర్యావరణ పరిరక్షణకు కూడా అనేది గుర్తుంచుకోవాలని పర్యావరణ కార్యకర్తలు ఘోషిస్తున్నారు.