విధాత : మహాశివరాత్రి సందర్బంగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెలుతున్న శివ భక్తులకు పెద్దపులి దర్శనం అశ్చర్య ఆందోళనలను కల్గించింది. నల్లమల అటవీ ప్రాంతంలోని పెచ్చేరువు వద్ద దోర్నాల సరిహద్దులో కాలి నడక దారి పక్కన పెద్దపులి కనిపించింది. దారి పక్కన పొదల మాటున నిలుచుని తన ముందే ఆ మార్గంలో శ్రీశైలంకు వెలుతున్న శివ భక్తులను ప్రశాంతంగా చూస్తున్న పెద్దపులి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
శ్రీశైలం భక్తులకు అన్నదానం కోసం సరుకులు తీసుకెళ్తున్న వాహనం నుంచి భక్తులు.. దారి పక్కన చెట్ల మధ్యన నిలుచున్న పెద్దపులిని తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. పెద్దపులిని చూసిన భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమై దారి వెంట భక్తుల రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టారు. అటవీశాఖ అధికారుల హెచ్చరికలతో అప్రత్తమైన భక్తులు భయంతో పరుగులు తీయకుండా ఎక్కడి వారక్కడే నిల్చుండిపోయారు. అటు పెద్దపులి, ఇటు భక్తులు అంతా కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా ఉండిపోగా..ఆ సమయం అంతా తీవ్ర ఉత్కంఠగా గడిచింది. కొంతసేపటికి పెద్దపులి భక్తులను ఎవరిని ఏమి అనకుండా.. నెమ్మదిగా అడవిలోకి వెళ్లిపోవడంతో భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు.
అంత దగ్గరలో పెద్దపులిని చూసిన శివ భక్తులు ‘శ్రీశైలం మల్లన్నే మమ్మల్ని కాపాడాడు అంటే..‘ఓం నమశ్శివాయ’ అంటూ భక్తితో నినాదాలు చేస్తూ తమ నడక యాత్రను కొనసాగించారు. నల్లమల అడవిలో పులుల సంచారం సాధారణమేనని..అయితే శ్రీశైలం వెళ్లే యాత్రికులు గుంపులుగా మాత్రమే ప్రయాణించాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.
నల్లమల అడవిలోని నడక దారిలో పెద్దపులి కనిపించడంతో భక్తులు దానిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. #Srisailam #Nallamala #tiger pic.twitter.com/R4WfTsqZ05
— greatandhra (@greatandhranews) February 11, 2026
