విధాత : గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ గాయని జానకి(88)ని కడసారి దర్శించుకుని కన్నీటి వీడ్కోలు పలికేందుకు అభిమాన జనం భారీగా కదిలారు. గాన కోకిల జానకి పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం మైసూర్ లోని మహారాజ కాలేజీ గ్రౌండ్స్ కు తీసుకొచ్చారు. సాయంత్రం 4గంటల వరకు ఇక్కడే ఉంచనున్నారు. తమ అభిమాన గాయని కడసారి చూపుకోసం అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆమెకు అశ్రునివాళి అర్పిస్తున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా తన మధురమైన గాత్రంతో 50 వేలకు పైగా పాటలు పాడిన “గాన కోకిల” కడసారి చూపు కోసం అభిమానులు, సినీ ప్రముఖులు భారీగా తరలివచ్చారు.
జానకి అంత్యక్రియలను కణియర హుండి గ్రామంలోని ఫామ్ హౌస్ లో ఈ రోజు సాయంత్రం 5గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. జానకి మృతి పట్ల సినీ, రాజకీయ రంగ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు. ప్రధాని మోదీ సహా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, పలు పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు జానకి మృతి పట్ల తమ సంతాపాన్ని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, తమిళనాడు, కర్ణాటక సీఎంలు విజయ్, శివకుమార్ లు కూడా జానకి మరణం పట్ల సంతాపం తెలియచేశారు.
తెలుగు, తమిళం, హిందీతో పాటుగా మొత్తం 17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి ఎన్నో జాతీయ పురస్కారాలు అందుకున్నారని వారంతా గుర్తుచేశారు. జానకమ్మ మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమకే కాకుండా కోట్లాది సంగీతాభిమానులకు తీరని లోటు అని వారు పేర్కొన్నారు. గాన కోకిలగా ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్న జానకమ్మగాత్రం అజరామరమని శ్లాఘించారు.