విధాత : పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతుండటం ప్రపంచ దేశాలకు ఆందోళనకరంగా మారుతుంది. హర్మూజ్‌లో అనధికార మార్గంలో ప్రయాణిస్తున్న కారణం చూపుతూ ఇరాన్ సైన్యం ఓ నౌకపై దాడి చేయడంతో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. సైప్రస్ జెండాతో హర్మూజ్‌లో అనధికార మార్గంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై తమ సైన్యం కాల్పులు జరిపిందని..హర్మూజ్ జల సంధిని మరోసారి మూసివేస్తునట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడి కారణంగా నౌకలోని ఒక సిబ్బంది మృతి చెందినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. ఇరాన్ చర్యలతో ఆగ్రహించిన అమెరికా ఆ దేశంలో మూడో విడత దాడులు ప్రారంభించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.
హర్మూజ్ తెరువాల్సిందే…అమెరికా డెడ్ లైన్..
ఇరాన్ ఓ తప్పుడు నిర్ణయం తీసుకుందని.. దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్ హెచ్చరించారు. టెహ్రాన్‌పై అమెరికా మూడో విడత నిర్వహించిన దాడులలో మొత్తం 140 టార్గెట్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. హర్మూజ్ తీరంలోని రెండు పట్టణాల్లో పేలుళ్లు సంభవించాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా వెల్లడించింది. వాణిజ్య నౌకలపై ఇరాన్ చర్యలు, వాటికి అమెరికా ప్రతిస్పందనల నేపథ్యంలో యుద్ధ విరమణకు కుదిరిన తాత్కాలిక ఒప్పందానికి విఘాతం ఏర్పడింది. అయితే అమెరికా మాత్రం 24గంటల్లోగా హర్మూజ్ ఫ్రీ రూట్ పై క్లారిటీ ఇవ్వాలని ఇరాన్ కు డెడ్ లైన్ విధించడం ఆసక్తికరంగా మారింది.
ఇరాన్ ప్రతికార దాడులతో గల్ఫ్ అంతటా ఉద్రిక్తతలు
టెహ్రాన్‌పై దాడులకు ప్రతీకారంగా కువైట్ .. బహ్రెయిన్, ఖతార్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్ దాడులు చేపట్టినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. కువైట్.. బహ్రెయిన్ లలోని యూఎస్ వైమానిక రక్షణ వ్యవస్థలు, ఆయుధ డిపో, రాడార్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఈ దాడులతో బహ్రెయిన్ అంతటా సైరన్‌లు మోగుతున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దోహాలో భారీ పేలుళ్ల వినిపిస్తుండడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఒమన్‌లోని దుఖ్మ్ ఓడరేవుపై ఇరాన్ భారీ దాడులు చేసింది. ఈ దాడుల్లో అమెరికా విమాన వాహక నౌకలు ఉపయోగించే లాజిస్టిక్స్ సహాయ కేంద్రాలు, ఇంధనం నింపే కేంద్రాలు ధ్వంసమయ్యాయి.
భారత్ సహా పలు దేశాలకు ఇంధన కొరత
ఇరాన్-అమెరికాల మధ్య సైనిక దాడులు కొనసాగుతుండటం..హర్మూజ్ జలసంధి మూసివేయడంతో భారత్ సహా పలు దేశాలు మరోసారి ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. మళ్లీ చమురు ధరలు పెరగగలవు. మళ్లీ ఇండియాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది.ఇకపై ఆ హర్మూజ్ జలసంధి మీదుగా తమ పర్మిషన్ లేకుండా ఏ నౌక వచ్చినా, కాల్పులు జరుపుతామని IRGC ప్రకటించింది. జలసంధిని మళ్లీ ఎప్పుడు తెరవాలో తామే నిర్ణయం తీసుకుంటామనీ, అప్పటివరకూ మూసివేత కొనసాగుతుందని చెప్పిందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. అందువల్ల ఇప్పుడు గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకి నౌకలు రావడం కష్టమైపోతుంది. ముఖ్యంగా ఖతార్ నుంచి గ్యాస్ నౌకలు రాలేవు. దాని వల్ల భారత్ లో ఇళ్లకు, హోటళ్లకు వంటగ్యాస్ కొరత రావచ్చు.
హర్మూజ్ మూసివేతతో భారత్ కు పెద్ద దెబ్బ
భారత్‌కు చెందిన 22 చమురు వాహక నౌకలు హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయాయి. ఈ నౌకల్లో 16.7 లక్షల టన్నుల ముడి చమురు, 3.2 లక్షల టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ), 2 లక్షల టన్నుల లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) ఉన్నట్లు నౌకాయాన మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా బుధవారం ప్రకటించారు. చిక్కుకున్న భారతీయ నౌకల్లో ప్రయాణిస్తున్న నావికులు సురక్షితంగా ఉన్నారని ఆయన తెలిపారు.
హార్ముజ్ జలసంధిని మూసేయడం భారత్‌కి పెద్ద దెబ్బ. భారత్ 88 శాతం ముడి చమురును, 50 శాతం సహజ వాయువును, 60 శాతం ఎల్‌పీజీని దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం ప్రారంభం కాక ముందు భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో 50 శాతం సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ వంటి దేశాల నుంచి వచ్చేది. ఆ దేశాల నుంచి వచ్చే చమురు నౌకలు తప్పనిసరిగా హర్మూజ్ జలసంధి మీదుగా రావాల్సిందే. చమురు దిగుమతుల్లో కలిగిన తరుగుదలను రష్యా, పశ్చిమ ఆఫ్రికా, అమెరికా, లాటిన్ అమెరికాల నుంచి వచ్చే దిగుమతుల సాయంతో కొంతవరకూ భర్తీ చేస్తున్నారు. పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు కావాల్సిన సహజవాయువు, ఎల్‌పీజీ సరఫరా నిలిచిపోయింది.
చమురు, గ్యాస్ ధరలకు మళ్లీ రెక్కలు..?
హార్ముజ్ మూసివేతతో ఇంధన, ఎల్పీజీ గ్యాస్ సరఫరాకి మరోసారి బ్రేక్ పడినట్లే. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు మరోసారి పెరగవచ్చు. అప్పుడు నిత్యవసర, అత్యవసర వస్తువుల ధరలు పెరగవచ్చు. రైతులకు ఎరువుల ధరలు పెరగగలవు. ఇంకా.. మందులు, డ్రై ఫ్రూట్స్ ధరలు పెరగగలవు. అందువల్ల రైతులు ఎరువుల్ని త్వరగా కొనుక్కోవడం మేలు.
అంతర్జాతీయంగా చమురు ధరలు ప్రస్తుతం బ్యారెల్‌కి $70-80గా ఉన్నాయి. ఇవి పెరగవచ్చనే అంచనాలున్నాయి. ఇండియా ప్రస్తుతం రష్యా, అమెరికా, బ్రెజిల్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఐతే.. ఈ దేశాలు మనకు చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి.. దిగుమతికి ఎక్కువ ఖర్చవుతోంది. అందువల్ల చమురు కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించేది లేదు అంటున్నాయి. ఇప్పుడు జలసంధిని మూసేశారు కాబట్టి.. ఇక ఇప్పట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గవు అనే అనుకోవాలి. జలసంధిని మళ్లీ ఎప్పుడు తెరుస్తారో తెలియదు. అంటే భారత్ కు చమురు, గ్యాస్, ఎరువుల కష్టాలు కొనసాగక తప్పని పరిస్థితి కొనసాగనుంది.