ప్రజావాణిలో ఇప్పటి వరకూ వచ్చిన దరఖాస్తులెన్ని? పరిష్కరించినవెన్ని?

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకూ మొత్తం 4,90,825 దరఖాస్తులు అదాయి.

  • Publish Date - February 25, 2024 / 01:46 PM IST

విధాత: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకూ మొత్తం 4,90,825 దరఖాస్తులు అదాయి. అందులో 3,96,224 దరఖాస్తులను వివిధ దశల్లో పరిష్కరించారని, 94,601 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమంపై ముఖ్యమంత్రి ఏ రేవంత్​ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, ప్రజలు నేరుగా సమస్యలు చెప్పుకొనేందుకు వీలు కల్పించే ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాముఖ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్‌గా నియమితులైన జీ చిన్నారెడ్డికి అదనంగా ప్రజావాణి బాధ్యతలను అప్పగించారని అంటున్నారు. ప్రతి నెలలో రెండు సార్లు ప్రజావాణి దరఖాస్తులపై సమీక్ష నిర్వహించటంతో పాటు అన్ని విభాగాలను సమన్వయం చేసే బాధ్యతలను ఆయన నిర్వర్తించనున్నారు. వారానికి రెండుసార్లు.. మంగళవారం, శుక్రవారం ప్రజాభవన్‌లో జరిగే ప్రజావాణిలో పాల్గొని, కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతలను చిన్నారెడ్డికి అప్పగించారు. అవసరమైతే సంబంధిత విభాగాల అధికారులతో ఏ వారానికి ఆ వారమే దరఖాస్తులపై సమీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్పటికప్పుడు సమీక్ష చేయటం ద్వారా ప్రజావాణి దరఖాస్తుల్లో వీలైనన్ని వెంట వెంటనే పరిష్కరించటం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీర్ఘకాలికమైనవి, విధాన పరమైన అంశాలకు సంబంధించిన దరఖాస్తులుంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని నిర్ణయించారు.


ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నోడల్ ఆఫీసర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ప్రతి మంగళ, శుక్రవారాల్లో మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో ఐఏఎస్ అధికారి దివ్య సారధ్యంలో వివిధ విభాగాల అధికారులు ప్రజాభవన్‌లో అర్జీలను స్వీకరిస్తున్నారు. వారికి వెంటనే రశీదు ఇవ్వటంతో పాటు ఆన్ లైన్ లో దరఖాస్తులను ఎంట్రీ చేస్తున్నారు. జిల్లా స్థాయిలో పరిష్కరించే వాటిని కలెక్టర్లకు పంపించటంతో పాటు రాష్ట్ర స్థాయివైతే సంబంధిత విభాగాలకు చేరవేస్తున్నారు. నేరుగా ప్రజలతో ముడిపడి ఉన్నందున, ప్రజల బాగోగులు, క్షేత్ర స్థాయిలోని సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజావాణి కార్యక్రమం అత్యంత కీలకంగా మారింది. ఇటు రాష్ట్ర స్థాయిలోనూ, అటు జిల్లా స్థాయిలోనూ కలెక్టర్లు, ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Latest News