Site icon vidhaatha

ధరణి పోర్టల్ లో 70 వేల ఎకరాల దేవాదాయ, వక్ఫ్‌ భూములు మాయం!

విధాత‌: ధరణి పోర్టల్‌లో దేవాదాయ, వక్ఫ్‌కు సంబంధించిన సుమారు 70వేల ఎకరాలు ఆచూకీ లేకుండా పోయాయి. ఇందులో దేవాదాయ భూములు 20వేల ఎకరాలు ఉంటే.. మరో 50వేల ఎకరాలు వక్ఫ్‌భూములు ఉన్నాయి. ధరణి పోర్టల్‌లో మాత్రం ఇవి కనిపించడం లేదు. ధరణికి, దేవాదాయ, వక్ఫ్‌ రికార్డులకు మధ్య పొంతనే లేదని ధరణి పోర్టల్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గుర్తించినట్టు తెలిసింది. ఇదే అంశంపై అధికారులను కమిటీ ప్రశ్నిస్తే.. వారు తెల్లముఖం వేశారని సమాచారం. శ‌నివారం (03-02-2024) స‌చివాల‌యంలో ధ‌ర‌ణి క‌మిటీ స‌ర్వే అండ్ సెటిల్‌మెంట్‌, వ‌క్ఫ్ బోర్డ్‌, దేవాదాయ శాఖ అధికారుల‌తో స‌మావేశ‌మైంది. స‌ర్వే నంబ‌ర్ స‌బ్ డివిజ‌న్‌లు చేస్తున్నారా? లేదా? అని ధ‌ర‌ణి క‌మిటీ అధికారుల‌ను ప్ర‌శ్నించింది. ధ‌ర‌ణిలో దేవాదాయ‌, వ‌క్ఫ్ భూముల ప‌రిస్థితి ఏమిట‌ని అడిగింది. ఈ భూముల ర‌క్ష‌ణ కోసం తీసుకున్న చ‌ర్య‌లను వివ‌రించాల‌ని క‌మిటీ కోరింది.


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ క‌మిటీ మొద‌ట స‌ర్వే సెటిల్ మెంట్ శాఖ అధికారుల‌తో మాట్లాడింది. ముఖ్యంగా ప్ర‌స్తుతం స‌ర్వే ఆండ్ సెటిల్‌మెంట్ శాఖ నిర్వ‌హిస్తున్న స‌ర్వే రికార్డుల జాబితా గురించి అడిగి తెలుసుకున్న‌ది. రాష్ట్రంలో ఖాస్రా ప‌హాణీ, సెసలా ప‌హాణీల నిర్వ‌హ‌ణ‌పై అడిగిన ధ‌ర‌ణి క‌మిటీ.. ఈ రికార్డుల‌ను ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో అప్‌లోడ్ చేశారా ? అని ప్ర‌శ్నించింది. భూభార‌తి కార్య‌క్ర‌మంలో భాగంగా చేప‌ట్టిన స‌ర్వే మ్యాప్‌ల ప్ర‌స్తుత స్థితి, ధ‌ర‌ణి పోర్ట‌ల్ స‌మాచారానికి, ఈ మ్యాప్‌ల‌కు మ‌ధ్య వ్య‌త్సాసం ఉందా ? అని అడిగి తెలుసుకున్న‌ది. రాష్ట్రంలో మూడు “పైగా “ల‌కు సంబంధించిన‌ డాక్యుమెంట్‌ల ప్ర‌స్తుత స్థితిని అడిగి తెలుసుకున్న‌ది. రైతులు స‌బ్‌డివిజ‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారని అడిగింది. అధికారులు ఈ వివ‌రాలు చెప్ప‌డంలో త‌డ‌బ‌డిన‌ట్లు స‌మాచారం.


వ‌క్ఫ్ బోర్డుకు ఉన్న మొత్తం భూ విస్తీర్ణం ఎంత ? ఈ భూములెన్ని ఎక‌రాలు క‌బ్జాకు గుర‌య్యాయి. వాటి విస్తీర్ణం ఎంత ఉంద‌ని అడిగింది. వ‌క్ఫ్ భూముల‌కు సంబంధించి నోటిఫికేష‌న్‌ల ప్ర‌క్రియ ఏమిట‌ని అడిగింది. వ‌క్ఫ్ భూములను రిజిస్ట్రేష‌న్‌, రెవెన్యూ శాఖ ఎలా ర‌క్షిస్తున్నాయని ప్ర‌శ్నించింది. వ‌క్ఫ్ బోర్డు నియంత్ర‌ణ‌లో ఉన్న భూముల విస్తీర్ణం ఎంత ఉంద‌ని అడిగి తెలుసుకున్న‌ది. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో వ‌క్ఫ్ భూముల‌కు సంబంధించి ఉన్న స‌మ‌స్య‌లు ఏమున్నాయ‌ని అడిగింది. దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న మొత్తం భూ విస్తీర్ణం ఎంత? వాటి ర‌క్ష‌ణ‌కు రిజిస్ట్రేష‌న్‌, రెవెన్యూ శాఖ తీసుకుంటున్న చ‌ర్య‌లేమిట‌ని ప్ర‌శ్నించింది. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో దేవాదాయ భూముల‌కు సంబంధించి నెల‌కొన్న స‌మ‌స్య‌ల గురించి అడిగి తెలుసుకున్న‌ది. సమావేశంలో సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, ధరణి కమిటీ సభ్యులు కోదండ‌రెడ్డి, రేమండ్ పీటర్, భూమి సునీల్ కుమార్, మధు సూధ‌న్, సీఎమ్మాఆర్ఓ వి.లచ్చిరెడ్డి మరియు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version