వికారాబాద్ : రక్షణగా ఉండాల్సిన కానిస్టేబుల్.. కామంతో రగిలిపోయాడు. ఒంటరిగా నిద్రిస్తున్న బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై, కానిస్టేబుల్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలో పని చేస్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నర్సింహులు శుక్రవారం అర్ధరాత్రి తన ఇంటికి చేరుకున్నాడు. అయితే సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి అదే అర్ధరాత్రి ప్రవేశించాడు. ఒంటరిగా నిద్రిస్తున్న బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలిక అరవడంతో.. పక్కగదిలో నివసిస్తున్న మహిళకు మెలకువ వచ్చింది. అనంతరం కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసింది.
బాలిక సోదరుడు.. కానిస్టేబుల్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి, షీ టీమ్స్‌కు సమాచారం అందించాడు. తనపై ఫిర్యాదు చేయొద్దని కానిస్టేబుల్ బతిమాలినప్పటికీ, బాధితురాలి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. బాలిక ఫిర్యాదు మేరకు వికారాబాద్ ఎస్ఐ అనిత కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కోటిరెడ్డి ఆదేశించారు.