Site icon vidhaatha

టాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు చలపతిరావు హఠాన్మరణం

విధాత, హైదరాబాద్‌ : తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ నటుడు తుమ్మారెడ్డి చలపతిరావు (78) హఠాన్మరణం చెందారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. 1948, మే 8న ఆయన కృష్ణా జిల్లా బర్రుపల్లిలో జన్మించారు.

ఆయన దాదాపు 1200 సినిమాల్లో నటించారు. చలపతిరావు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. ఆయన తనయుడు డైరెక్టర్‌, నటుడు రవిబాబు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల కిందట నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతి చెందిన మృతి చెందగా.. తాజాగా చలిపతిరావు ఆకస్మిక మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం అలుముకున్నది.

చలపతి రావుని అందరూ బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు. అతను నటించిన మొదటి చిత్రం గూఢచారి 116 కాగా చివరి చిత్రం ఓ మనిషి నీవేవరు విడుదల కావాల్సి ఉంది. అలాగే ఆయన నిర్మాతగా పలు సినిమాలను సైతం నిర్మించారు. సీనియర్‌ నటుడు ఎన్‌టీఆర్‌తో చలపతిరావుకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన ప్రోత్సాహంతోనే నటుడిగా నిలదొక్కుకున్నారు. ఎక్కువగా ఆయన సినిమాల్లోనే అవకాశాలను అందిపుచ్చుకున్నారు. నిన్నేపెళ్లాడుతా సినిమాలో సీనియర్‌ నటి లక్ష్మికి జోడిగా నటించి మెప్పించారు. ఇక అప్పటినుంచి అవకాశాలు అమాంతం పెరిగాయి.

చలపతిరావుకి 19 ఏండ్ల వయస్సులో వివాహం కాగా ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుని ఆమె మరణించింది. ఇక ఆయన మరో పెళ్లి చేసుకోకుండా తన ముగ్గురు పిల్లలను అన్నీ తానై పెంచారు. తాను చదువుకోలేదని పిల్లలకు మంచి చదువు చెప్పించాలని తీవ్రంగా కష్టపడి మంచి చదవులు చెప్పించి వారందరినీ మంచి స్థానాల్లో నిలిపారు.

ఎన్టీఆర్‌తో కలిసి యమగోల, యుగపరుషుడు, డ్రైవర్‌ రాముడు, అక్బర్‌ సలీమ్‌ అనార్కలీ, జస్టిస్‌ చౌదరి, బొబ్బిలిపులి, చట్టంతో పోరాటం, దొంగరాముడు తదితర చిత్రాల్లో నటించారు. విలన్‌గా, తండ్రిగా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తనదైన శైలిలో నటించారు. అదేవిధంగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాల్లో నటించారు. ఆయన మృతికి టాలీవుడ్‌ సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.

Exit mobile version