Allola Indrakaran Reddy | ఆలయాల శాఖకు అమాత్యులుగా పనిచేసిన వారికి అనంతరం రాజకీయ జీవితంలో దేవుడి కరుణ మాత్రం కలగలేదని చరిత్ర చెబుతోంది. ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి మొదలుకుంటే.. ఉమ్మడి ఏపీలో కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్ వరకు 8 మంది నేతలు దేవాదాయ శాఖ మంత్రులుగా పని చేశారు. వారిలో ఎవర్నీ కూడా మంత్రి పదవి వరించలేదు. ఎమ్మెల్యేగా గెలవడం కూడా కష్టమైందని రికార్డులు ఉన్నాయి. కానీ నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం 36 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. కేసీఆర్ తొలి కేబినెట్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన అల్లోల.. మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేసీఆర్ రెండో కేబినెట్‌లో కూడా దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి రికార్డు సృష్టించారు. ఇక తాజా ఎన్నికల్లో నిర్మల్ నుంచి పోటీ పడుతున్న ఇంద్రకరణ్‌రెడ్డి ఐదోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు.
1983 నుంచి 2004 వరకు
1983లో ఎన్టీ రామారావు కేబినెట్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా పని చేసిన యతిరాజారావుతో పాటు 1994లో దేవాదాయ శాఖ మంత్రిగా పని చేసిన సీనియర్ నాయకుడు సింహాద్రి సత్యనారాయణ కూడా ఆ తర్వాత ఎన్నికల్లో ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. 1995లో నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో దేవాదాయ శాఖ నిర్వహించిన దామచర్ల ఆంజనేయులు కూడా తదుపరి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1999 సాధారణ ఎన్నికల తర్వాత చంద్రబాబు కేబినెట్‌లో దండు శివరామరాజుకు దేవాదాయ శాఖ బాధ్యతలు కట్టబెట్టారు. 2004 ఎన్నికల్లో దండుకు టికెట్ దక్కలేదు. తర్వాత ఈ శాఖ చేపట్టిన ఎం సత్యనారాయణరావు మధ్యలోనే పదవి నుంచి తప్పుకున్నారు. అనంతరం ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎమ్మెస్సార్ తర్వాత జువ్వాడి రత్నాకర్ రావు దేవాదాయ శాఖ చేపట్టారు. ఆయన 2009 ఎన్నికల్లో గెలవలేదు.
గాదె, జేసీపై ప్రభావం.. జూపల్లికి కూడా..
2009 ఎన్నికల అనంతరం దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గాదె వెంకట్ రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో చోటుదక్కలేదు. ఎమ్మెస్సార్, రత్నాకర్ రావు మధ్యలో కొన్ని నెలలు దేవాదాయ శాఖ బాధ్యతలు చేపట్టిన జేసీ దివాకర్ రెడ్డికి 2009లో మంత్రి పదవి రాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన జూపల్లి కృష్ణారావుకు కేసీఆర్ తొలి కేబినెట్‌లో మంత్రి కాలేకపోయారు. 2014 డిసెంబర్‌లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో జూపల్లికి కేబినెట్‌లో చోటు దక్కినప్పటికీ, దేవాదాయ శాఖ తీసుకోలేదు. నాడు అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2018 ముందస్తు ఎన్నికల వరకు ఆ మంత్రి పదవిలో అల్లోల కొనసాగారు. మళ్లీ గెలిచి దేవాదాయ శాఖ మంత్రిగా కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. అంటే దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారికి రాజకీయ భవిష్యత్ ఉండదన్న ముద్రను అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెరిపేశారు.
ఇంద్రకరణ్ రెడ్డి రాజకీయ ప్రస్థానం..
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌బీ పట్టా పుచ్చుకున్న ఇంద్రకరణ్ రెడ్డి 1980లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1987 నుంచి 1991 వరకు జిల్లా పరిషత్ చైర్మన్‌గా సేవలందించారు. 1991 నుంచి 1996 వరకు ఎంపీగా కొనసాగారు. 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 ఉప ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2014లో బీఎస్పీ నుంచి గెలుపొంది, టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో బీఆర్ఎస్ తరపున నిర్మల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇక ఈ నియోజకవర్గంలో బీజేపీ తరపున ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కే శ్రీహరి రావు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో శ్రీహరిరావు ఇంద్రకరణ్ రెడ్డికి పోటీనిచ్చారు.