Site icon vidhaatha

పనిచేయకుండా విమర్శలకే.. ఆ ముగ్గురికీ అందుకే ఈ ఫలితం!!

(విధాత ప్రత్యేకం)

ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. బండి సంజయ్‌ని మార్చిన తర్వాత బీజేపీ రాష్ట్రంలో బలహీనపడిందనేది కొందరి వాదన. కానీ సంజయ్‌ అయినా, అర్వింద్‌ అయినా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మరిచి మతం పేరుతోనో, లేదా కేసీఆర్‌ కుటుంబంపై నిత్యం విమర్శలు చేస్తూనే కాలం గడిపారు. వీళ్లు ఎంపీలుగా ఐదేళ్ల కాలంలో చేసిన దానికంటే కాంగ్రెస్‌ పార్టీని, బీఆర్‌ఎస్‌ పార్టీని నిందించడానికే పరిమితమయ్యారు.


ప్రజలు తమ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకపోతే ఆదరించని, ప్రజాక్షేత్రంలో వారికి ఓటమి తప్పదని వీరిద్దరి ఓటమి స్పష్టం చేస్తున్నది. ఇక ఈటల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఆయనకు అక్కడ పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. సంజయ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఆయనకు, ఈటల వర్గానికి పొసగలేదు. కేసీఆర్‌పై కోపంతోనో, రేవంత్‌రెడ్డిని బూచిగా చూపెట్టి పార్టీని వీడిన కోమటిరెడ్డి వాళ్లకు తొందరగానే ఆ పార్టీ విధానాలు అవగతమయ్యాయి. అంతేకాదు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలను బీజేపీలోకి తీసుకుని రావడానికి ఈటల నేతృత్వంలో జరిపిన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారే రాజేందర్‌ను కాంగ్రెస్‌లోకి రమ్మన్నారు. కానీ కాంగ్రెస్‌ పార్టీలో బీజేపీలో కంటే ఎక్కువ నాయకత్వ పోటీ ఉంటుందని భావించిన ఈటల అందులోనే కొనసాగారు. తనకు తానే సీఎం అభ్యర్థిగా ప్రమోట్‌ చేసుకోవడానికి హుజురాబాద్‌ను వదిలి గజ్వేల్‌కు వెళ్లారు.


ఇక్కడే ఈటల రాజేందర్‌ లాజిక్‌ మిస్సయ్యారు. రాష్ట్రంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌ నియోజకవర్గాలు మాత్రమే అభివృద్ధి చెందాలా? మిగిలిన నియోజకవర్గాలు అభివృద్ధి చెందకూడదా అని విపక్షాలు ప్రశ్నించాయి. అంటే కేసీఆర్‌ నేతృత్వం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో బాగానే అభివృద్ధి చెందిందని విపక్ష పార్టీలే పరోక్షంగా అంగీకరించాయి. అక్కడ మల్లన్న సాగర్‌ ముంపు బాధితుల సమస్యతో పాటు, తమకు సీఎం అందుబాటులో ఉండరనేది సొంతపార్టీ నేతల్లోనే అసంతృప్తి ఈ రెండు కారణాలు తప్ప మరేవీ లేవు.


కానీ అక్కడ ముదిరాజ్‌ ఓటర్లు, మల్లన్న సాగర్‌ ముంపు బాధితులంతా తనకే ఓటు వేస్తారని ఈటల కలలుగన్నారు. హుజురాబాద్‌ ప్రచార బాధ్యతను తన సతీమణికి అప్పగించి ఆయన మొత్తం గజ్వేల్‌పైనే దృష్టి కేంద్రీకరించారు. 2004 నుంచి హుజురాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల తన సేఫ్‌ నియోజకవర్గాన్ని వదిలి చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. ఈటల రాజేందర్‌ రెంటికి చెడిన రేవడిలా తయారయ్యారు.

Exit mobile version