ఇద్దరు భార్యలను కలిగిన భర్తల పెన్షన్ విషయంలో నానా తలనొప్పులు ఎదుర్కొంటున్న అసోం.. ఈ సమస్యకు ముగింపు పలికే నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వోద్యోగి చనిపోయినప్పుడు ఆయనకు ఇద్దరు భార్యలు ఉండి ఉంటే.. పెన్షన్ తనకు రావాలంటూ కాదు.. తనకే రావాలంటూ ఇద్దరు భార్యలూ తగువులాడుకుని కోర్టులకెక్కతున్నారు. ఇది తీవ్ర ఇబ్బందికరంగా మారడంతో ఇకపై మొదటి భార్య బతికి ఉండగా ప్రభుత్వోద్యోగులు రెండో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని అసోం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ప్రభుత్వ అనుమతి ఉంటే ఆమె లేదా అతను రెండో పెళ్లి చేసుకోవచ్చని పేర్కొన్నది.
ఈ మేరకు సిబ్బంది శాఖ ఆఫీస్ మెమొరాండం (ఓఎం) జారీ చేసింది. భార్య బతికి ఉండగా రెండో పెళ్లి చేసుకోవాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. లేనిపక్షంలో సంబంధిత చట్టాల మేరకు ఆ రెండో వివాహాన్ని ప్రభుత్వం గుర్తించదు.. అని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా.. మొదటి భార్య బతికి ఉండగా రెండో వివాహం చేసుకున్నవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. మహిళా ఉద్యోగులకు కూడా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. సిబ్బంది శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ నీరజ్ శర్మ ఈ నెల 20 తేదీన జారీ చేసిన ఈ నోటిఫికేషన్ తాజాగా వెలుగు చూసింది. తమ సర్వీసు నిబంధనల ప్రకారం రెండో వివాహం చట్టబద్ధం కాదని శర్మ పేర్కొన్నారు. అయితే.. కొన్ని మతాల్లో రెండో వివాహం చేసుకునేందుకు అనుమతి ఉన్న రీత్యా ప్రభుత్వం నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.
చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇద్దరు భార్యలు పెన్షన్ కోసం పోట్లాడుకుంటున్న సందర్భాలను తాము అనేకం ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ వివాదాలను పరిష్కరించడానికి తల ప్రాణం తోకకు వస్తున్నదని అన్నారు. ఈ పోట్లాటల కారణంగా అనేక మంది వితంతువులు పెన్షన్ అందుకోలేక పోతున్నారని తెలిపారు. తాము నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు ముందు నుంచీ ఉన్నవేనని, కానీ.. అమలు చేయలేదని చెప్పారు. ఇప్పుడు వాటిని కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.
ప్రభుత్వ అనుమతి లేకుండా రెండో వివాహం చేసుకుంటే.. భారీ జరిమానా విధించడంతోపాటు.. నిర్బంధ పదవీవిరమణ తప్పదని నోటిఫికేషన్ పేర్కొంటున్నది. ఇటువంటి ఉదంతాలు వెలుగు చూస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. బహుభార్యాత్వాన్ని నిషేధించేందుకు ఒక చట్టం తేవాలని అసోం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదన్న వార్తల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ కావడం గమనార్హం.