Rahul Gandhi | దళితులు, గిరిజనుల అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకంగా పని చేస్తుందని, వారిపై దాడులకు పాల్పడుతుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మిజోరం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ సోమవారం ఐజ్వాల్‌లో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఐజ్వాల్‌లోని చన్మారి ఏరియా నుంచి రాజ్ భవన్‌కు వరకు పాదయాత్ర నిర్వహించి, ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మిజోరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ పొరుగు రాష్ట్రమైన మణిపూర్‌లో హింసను ప్రేరేపించారని ఆరోపించారు. మణిపూర్‌లో హింస కొనసాగుతున్నప్పటికీ మోదీ ఇంతవరకు ఆ అంశంపై దృష్టి సారించలేదని ధ్వజమెత్తారు. మణిపూర్‌ను మోదీ సందర్శించలేదని మండిపడ్డారు. కొన్ని నెలల క్రితం తాను మణిపూర్ వెళ్లానని, అక్కడి పరిస్థితులను చూసి షాక్ అయ్యానని రాహుల్ పేర్కొన్నారు. మణిపూర్ ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయిందన్నారు. మణిపూర్ లాంటి ఘటనలు దేశంలో పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. గిరిజనులు, దళితులు, మైనార్టీలపై దాడులకు పాల్పడుతుందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.
తనకు 16 ఏండ్ల వయసున్నప్పుడు నాన్నతో కలిసి మిజోరం సందర్శించానని రాహుల్ గుర్తు చేశారు. బీజేపీ మిజోరం ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, భాషపై దాడి చేస్తుందన్నారు. ప్రస్తుతం మిజోరంలో అధికారంలో ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ కూడా బీజేపీకి మద్దతిస్తుందని రాహుల్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు మీ భాషను కాపాడుతాం అని రాహుల్ స్పష్టం చేశారు.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవలే మిజోరం సెక్యూలర్ అలయెన్స్(MSA) ను ఏర్పాటు చేసింది. ఈ అలయెన్స్‌లో పీపుల్స్ కాన్ఫరెన్స్, జోరం నేషనలిస్ట్ పార్టీ (ZNP) ని భాగస్వామ్యం చేసింది. మిజోరం సెక్యూలర్ అలయెన్స్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుందని స్థానిక కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది.
2018 ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్.. కాంగ్రెస్ పార్టీని ఓడించి, తిరిగి పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. మిజోరంలోని 40 అసెంబ్లీ స్థానాల్లో మిజో నేషనల్ ఫ్రంట్ 26 స్థానాల్లో గెలిచి, అధికారాన్ని చేజిక్కించుకుంది. 2008 నుంచి వరుసగా రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ మిజోరంలో ప్రభుత్వాన్ని నడిపించింది. మళ్లీ ఈ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. నవంబర్ 7వ తేదీన ఒకే దశలో పోలింగ్ జరగనుంది.