Site icon vidhaatha

సుప్రీంకోర్టును వాయిదాల కోర్టుగా మార్చ‌కండి.. కేసుల సత్వర విచారణ ఎలా?

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో న్యాయ‌వాదులు ప‌దే ప‌దే కేసుల వాయిదాలు కోర‌డంపై చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ శుక్ర‌వారం అసంతృప్తి వ్య‌క్తం చేశారు. సుప్రీంకోర్టును వాయిదాల కోర్టుగా మార్చ‌కూడ‌ద‌ని అన్నారు. సెప్టెంబ‌ర్ నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు మొత్తం 3,688 వాయిదాల‌ను న్యాయ‌వాదులు కోరిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. కేసుల స‌త్వ‌ర విచార‌ణ జ‌ర‌పాల‌న్న ఉద్దేశాన్ని ఇవి దెబ్బ‌తీస్తాయ‌ని అన్నారు. కేసును స‌త్వ‌ర‌మే విచారించాల్సి ఉండ‌గా.. దాని బ‌దులు వాయిదాలు కోరుతున్నార‌ని చెప్పారు. త‌రీఖ్ పే త‌రీఖ్ (వాయిదాల‌) కోర్టుగా దీనిని మార్చ‌రాద‌ని వ్యాఖ్యానించారు. దీనివ‌ల్ల ప్ర‌జ‌ల న‌మ్మ‌కం స‌డ‌లిపోతుంద‌ని హెచ్చ‌రించారు. అలా జ‌రుగ‌కుండా చూడాల్సిన నైతిక‌ బాధ్య‌త మ‌న‌పైనే ఉన్న‌ద‌ని చెప్పారు.


అంతేకాకుండా.. ఇలా కేసుల వాయిదాలు కోర్టు విష‌యంలో మంచి సందేశాన్ని ఇవ్వ‌బోవ‌ని అన్నారు. కేసు ఫైల్ అయిన ద‌గ్గ‌ర నుంచి విచార‌ణ‌కు లిస్టు అయ్యే మ‌ధ్య వ్య‌వ‌ధి త‌గ్గిపోవ‌డాన్ని ఆయ‌న ప్ర‌స్తావిస్తూ.. సుప్రీంకోర్టు బార్ అసోసియేష‌న్ (ఎస్‌సీబీఏ), సుప్రీం కోర్టు అడ్వ‌కేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేష‌న్ (ఎస్‌సీఏఓఆర్ఏ) కృషి లేనిదే అది సాధ్య‌మ‌య్యేది కాదంటూ అభినందించారు. అదే స‌మ‌యంలో న్యాయ‌వాదులు వాయిదాలు కోర‌డం గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని చెప్పారు.


న‌వంబ‌ర్ 3వ తేదీన 178 వాయిదా విన‌తులు వ‌చ్చాయ‌ని తెలిపారు. అక్టోబ‌ర్ నెల‌లో దాదాపు రోజుకు 150 చొప్పున ఉన్నాయ‌ని చెప్పారు. మొత్తంగా ఆ నెల‌లో 3688 వాయిదా విన‌తులు వ‌చ్చాయ‌ని సీజేఐ తెలిపారు. ఇలాగైతే కేసుల స‌త్వ‌ర విచార‌ణ ఎలా సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు. ఒక‌వైపు న్యాయ‌వాదులే అత్య‌వ‌సంగా విచార‌ణకు స్వీక‌రించాల‌ని కోరుతార‌ని, అవి లిస్ట్ కాగానే వారే వాయిదాలు అడుగుతార‌ని చెప్పారు. ఇలా సెప్టెంబ‌ర్ నుంచి న‌వంబ‌ర్ 1 వ‌ర‌కూ 58 ఉదంతాలు ఉన్నాయ‌ని వివ‌రించారు.

Exit mobile version