Site icon vidhaatha

కొవిడ్‌పై మ‌ళ్లీ నిజాలు దాస్తున్న చైనా..? WHOకు అంద‌ని నివేదిక‌లు..!

Covid-19 | చైనాలో క‌రోనా విల‌యం సృష్టిస్తున్న‌ది. ఆ దేశంలో ప్ర‌స్తుతం ప‌రిస్థితి పూర్తిగా అదుపు త‌ప్పింది. ఆసుప‌త్రులు కొవిడ్ బాధితుల‌తో నిండిపోగా.. రోజు రోజుకూ కొత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ఓ లెక్క ప్ర‌కారం.. ప్ర‌స్తుతం చైనాలో 54ల‌క్ష‌ల మంది క‌రోనా బాధితులున్నారు. మ‌రో వైపు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నుంచి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వ‌చ్చింది. చైనా జీరో కొవిడ్ విధానాన్ని ఉప‌సంహ‌రించిన త‌ర్వాత.. ఆసుప‌త్రుల్లో చేరిన వారి డేటాను డ్రాగ‌న్ కంట్రీ పంప‌డం మానేసింది. చైనా చ‌ర్య ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌రోసారి ఆరోగ్య నిపుణుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తున్న‌ది. కరోనా ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన సమాచారాన్ని చైనా మళ్లీ దాచిపెడుతుందని నిపుణులు భయపడుతున్నారు.

చివ‌రిసారి పంపింది అప్పుడే..

అయితే, ఈ సమయంలో పెరుగుతున్న కేసులతో అధికారులు ఇబ్బందులు ప‌డుతుండ‌డ‌మే డేటా పంప‌క‌పోవ‌డానికి కార‌ణ‌మ‌ని WHO తెలిపింది. చైనా చివ‌రిసారిగా ఈ నెల 7న మాత్ర‌మే డేటాను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు పంపింది. డిసెంబ‌ర్ 4వ తేదీ నాటికి చైనాలో 28వేల‌కుపైగా కొవిడ్ కేసులున్నాయి. ఇవి గ‌త మూడేళ్ల‌లో అత్య‌ధికంగా. అయితే, చైనా జీరో కొవిడ్ విధానంపై నిర‌స‌న‌లు వెల్లువెత్త‌గా.. 7న ఉప‌సంహ‌రించుకున్న‌ది. అప్ప‌టి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు ఎలాంటి స‌మాచారం అంద‌డం లేద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి. ఎప్పుడూ చైనా క‌రోనాను త‌క్కువ చేసి చూపిస్తోంద‌ని ఆరోప‌ణ‌లున్నాయి. మ‌ర‌ణాల విష‌యంలోనూ ఇదే తీరును వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆసుప‌త్రుల్లో బెడ్ల కొర‌త‌

చైనాలోని బీజింగ్, గ్వాంగ్‌జౌ, షెన్‌జెన్, షాంఘై నగరాల్లో కొవిడ్‌తో ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఒత్తిడి నేప‌థ్యంలో వైర‌స్ ఫ్లూలాంటిద‌ని, కొత్త ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌మాద‌క‌ర‌మైందేమీ కాద‌ని ప్ర‌జ‌ల‌కు చెప్పిన‌ట్లు బ్లూమ్‌బ‌ర్గ్ పేర్కొంది. ఎపిడెమియాలజిస్ట్ ఝాంగ్ నాన్షాన్ సైతం ఒమిక్రాన్ వైరస్ సాధారణ జలుబు లాంటిదే త‌ప్ప‌.. మ‌రేం కాద‌ని, భ‌య‌ట‌ప‌డొద్ద‌ని సూచించిన‌ట్లు చెప్పింది. అయితే, జీరో కొవిడ్ విధానాన్ని సడలించినప్పటికీ ఆసుపత్రుల్లో పడకలు నిండిపోయాయి. భారీగా మ‌ర‌ణాలు నమోద‌వుతున్నాయ‌ని, ప‌రిస్థితి భ‌యంక‌రంగా ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, ఇప్ప‌టికీ చైనా క‌రోనాపై స్ప‌ష్ట‌మైన స‌మాచారాన్ని ఇవ్వ‌డం లేదు.

1.25 కోట్ల మందికి క‌రోనా..

గ‌త మూడురోజులుగా చైనాలో క‌రోనా ఎవ‌రూ చ‌నిపోలేద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2019 నుంచి మరణాల సంఖ్య 5,241 మాత్రమే. నగరంలో ప్రస్తుతం 5.4 మిలియన్లకుపైగా కరోనా సోకిందని, ఈ నెలాఖరు నాటికి వారి సంఖ్య 12.5 మిలియన్లకు పెరుగుతుందని షాంఘై డైసీ హాస్పిటల్ బుధవారం అధికారిక WeChat ఖాతాలో తెలిపింది.

Exit mobile version