Site icon vidhaatha

గ్యాంగ్‌స్ట‌ర్ల ప్రేమ‌ పెళ్లికి 6 గంట‌ల పెరోల్ అనుమ‌తి

వారిద్ద‌రూ గ్యాంగ్‌స్ట‌ర్లు.. నాలుగేండ్ల క్రితం ప్రేమించుకున్నారు. మ‌రో నాలుగు రోజుల్లో ఒక్క‌టి కాబోతున్నారు. వీరి ప్రేమ పెళ్లికి కోర్టు 6 గంట‌ల పాటు పెరోల్ అనుమ‌తి ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ గ్యాంగ్‌స్ట‌ర్ల ప్రేమ పెళ్లి చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ‌స్థాన్‌కు చెందిన అనురాధ చౌద‌రి అలియాస్ మేడం మింజ్, హ‌ర్యానాకు చెందిన సందీప్ అలియాస్ క‌లా జ‌థేడి గ్యాంగ్‌స్ట‌ర్లు. ప్ర‌ముఖ గ్యాంగ్‌స్ట‌ర్ ఆనంద్‌పాల్ సింగ్ వ‌ద్ద అనురాధ ప‌ని చేశారు. మ‌నీ లాండ‌రింగ్, కిడ్నాప్, బెదిరింపుల వంటి ప‌లు కేసుల్ని అనురాధ ఎదుర్కొంటోంది. ఆమెపై రాజ‌స్థాన్, ఢిల్లీలో కేసులు న‌మోదు అయ్యాయి.

గ్యాంగ్‌స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్‌కు సందీప్ అత్యంత స‌న్నిహితుడు. దోపిడీ, హ‌త్య‌లు, హ‌త్యాయ‌త్నం వంటి కేసులు సందీప్‌పై డ‌జ‌న్‌కు పైగా ఉన్నాయి. ఢిల్లీ, హ‌ర్యానా, పంజాబ్, రాజ‌స్థాన్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా సందీప్‌ పోలీసు రికార్డుల్లోకి ఎక్కారు.

అయితే సందీప్, అనురాధకు ఓ ఫ్రెండ్ ద్వారా ప‌రిచ‌య‌మైంది. 2020 నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. ప‌లు కేసుల్లో నిందితులుగా ఉన్న వీరు పోలీసుల క‌ళ్లుగ‌ప్పి త‌ప్పించుకు తిరుగుతున్నారు. 2021, జులై 30వ తేదీన వీరిద్ద‌రిని య‌మునా న‌గ‌ర్ – షాహార‌న్‌పూర్ హైవేపై ఉన్న ఓ దాబా వ‌ద్ద ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం వారిని జైలుకు త‌ర‌లించారు. అయితే అనురాధ బెయిల్‌పై విడుద‌లయ్యారు. సందీప్‌కు బెయిల్ ల‌భించ‌లేదు.

ఇక వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇదే విష‌యాన్ని సందీప్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు కూడా గ్యాంగ్‌స్ట‌ర్ల ల‌వ్ మ్యారేజ్‌కు అనుమ‌తి ఇచ్చింది. మార్చి 12వ తేదీన సోనిప‌ట్‌లో వీరి వివాహం జ‌ర‌గ‌నుంది. దీంతో సందీప్‌కు ఆరు గంట‌ల పాటు పెరోల్ అనుమ‌తి ఇచ్చింది. ఈ ఆరు గంట‌ల్లోనే సందీప్, అనురాధ పెళ్లి తంతు ముగించేలా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ప్ర‌స్తుతం వీరి పెళ్లి నెట్టింట వైర‌ల్ అవుతోంది.

అనురాధ ఎంబీఏ గ్రాడ్యుయేట్..

అనురాధ ఎంబీఎ పూర్తి చేశారు. బ్యాంకింగ్ బిజినెస్‌లో కూడా ఉద్యోగం చేశారు. ఆ త‌ర్వాత ఆమె మ‌నీ లాండ‌రింగ్‌కు పాల్ప‌డ్డారు. దీంతో జైలు పాల‌య్యారు. అనంత‌రం రాజ‌స్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్ట‌ర్ ఆనంద్ పాల్‌తో ఆమె చేతులు క‌లిపారు. అప్ప‌ట్నుంచి ఆమె గ్యాంగ్‌స్ట‌ర్‌గా మారిపోయారు. ఆనంద్‌పాల్ 2017లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో చ‌నిపోయారు. అయితే అనురాధ‌కు తొలిసారిగా 2007లో వివాహ‌మైంది. త‌న మొద‌టి భ‌ర్త పేరు దీప‌క్ మింజ్. భ‌ర్త పేరులోని మింజ్‌.. త‌న పేరుకు త‌గిలించుకున్నారు. దీప‌క్‌తో 2013లో విడాకులు తీసుకున్నారు. 

Exit mobile version