Most Polluted City | ప్రపంచంలోనే అత్యంత పొల్యూటెడ్‌ క్యాపిటల్‌గా ఢిల్లీ..! స్విస్‌ గ్రూప్‌ రిపోర్టులో కీలక విషయాలు..!

  • Publish Date - March 19, 2024 / 04:12 AM IST

Most Polluted City | ప్రపంచంలోనే అత్యంత పొల్యూటెడ్‌ రాజధానిగా ఢిల్లీ మూడోస్థానం నిలిచింది. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ తర్వాత భారత్‌లోని ఢిల్లీ ఈ జాబితాలో మూడోస్థానంలో ఉన్నది. స్విస్‌ గ్రూప్‌ ఐక్యూ ఎయిర్‌ తాజాగా వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 రిపోర్ట్‌ పేర్కొంది. స్విస్ ఆర్గనైజేషన్ ఐక్యూ ఎయిర్ 2023 నివేదిక ప్రకారం.. బంగ్లాదేశ్‌లో క్యూబిక్ మీటరుకు 79.9 మైక్రోగ్రాములు, పాకిస్తాన్ క్యూబిక్ మీటరుకు 73.7 మైక్రోగ్రాముల గాలి నాణ్యత తక్కువగా ఉంది. మరోవైపు, 2022 సంవత్సరంలో భారతదేశం క్యూబిక్ మీటరుకు సగటున 53.3 మైక్రోగ్రాముల PM 2.5 సాంద్రతతో అత్యంత కాలుష్య దేశాల జాబితాలో ఎనిమిదో ర్యాంకులో నిలిచింది. 2018 నుంచి వరుసగా నాలుగు సార్లు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ నిలిచింది. నివేదిక ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య మెట్రోపాలిటన్ పట్టణంగా బిహార్‌లోని బెగూసరాయ్ నిలిచింది. బెగూసరాయ్‌లో గాలినాణ్యత క్యూబిక్ మీటర్‌కు 54.4 మైక్రోగ్రాములుగా ఉందని నివేదిక తెలిపింది. అయితే, 2022లో 131 దేశాల్లోని 7,323 ప్రాంతాల్లో సర్వే చేయగా.. గతేడాది 134 దేశాల్లోని 7,812 చోట్ల సర్వే చేసినట్లు వరల్డ్ ఎయిర్ క్వాలిటీ సంస్థ పేర్కొంది. వివిధ పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలు, ఇతర పరిశోధనా సంస్థలు రూపొందించిన డేటాను పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పింది.

మానవ ఆరోగ్యానికి పెనుముప్పు

ప్రపంచంలో ప్రతి తొమ్మిది మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగానే సంభవిస్తోంది. ఇది మానవ ఆరోగ్యానికి అతిపెద్ద ముప్పుగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏడు మిలియన్ల అకాల మరణాలు సంభవిస్తున్నాయి. వీటికి వాయు కాలుష్యం కారణమని అంచనా. కాలుష్యం కారణంగానే అనేక వ్యాధుల బారినపడుతున్నారు. ఇందులో ఆస్తమా, క్యాన్సర్, స్ట్రోక్, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నాయి. 2010లో నిర్వహించిన అధ్యయనంలో పీఎం 2.5 కారణంగా గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల కారణంగా మరణాల రేటు పెరుగుతున్నట్లుగా గుర్తించారు. సెంటర్స్‌ ఫడ్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (CDC) ప్రకారం.. వృద్ధులు, శిశువులపై మరింత తీవ్రమైన ప్రభావం చూపుతుంది. పీఎం 2.5 బారినపడుతుండడంతో కంటి, శ్వాస సమస్యలు పెరుగుతాయి. కళ్లలో నీరు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, చర్మ సంబంధిత సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. పొల్యూషన్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌, గాగుల్స్‌ ధరించడం.. ముఖాన్ని ఎప్పుడూ నీటి శుభ్రంగా కడుగుతూ ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Latest News