Site icon vidhaatha

Farmers Protest | ఢిల్లీ చలో మార్చ్‌ నిలిపివేత..! కేంద్రంతో రైతు సంఘాల చర్చలు ఫలప్రదం..!

Farmers Protest | పంటలకు కనీస మద్దతు ధర (MSP) చట్టపరమైన హామీ అంశంపై ఆదివారం చండీగఢ్‌లో రైతు సంఘాల నాయకులతో ముగ్గురు కేంద్రమంత్రులో నాలుగో విడత చర్చలు జరిపారు. భేటీలో నాలుగు పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం అంగీకరించింది. వరి, గోధుమలతో పాటు మినుము, మక్కజొన్న, పత్తి పంటలతో పాటు పలు పప్పుధాన్యాలకు ఎంఎస్‌పీ ఇచ్చేందుకు కేంద్రం ప్రతిపాదించింది.


అయితే, దీని కోసం రైతులు నేషనల్‌ అగ్రికల్చర్‌ కో ఆపిరేటివ్‌ మార్కెటింగ్‌ (నాఫెడ్‌), కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ద్వారా ముందుకెళ్లనున్నారు. అయితే, ఐదేళ్లకాలానికి ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. పంజాబ్‌, హర్యానాలో అడుగంటుతున్న భూగర్భ జలాలను కాపాడేందుకు పంటల వైవిధ్య అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ ప్రదిపాదన చేయగా.. చాలామంది రైతులు సూత్రప్రాయంగా అంగీకరించారు.


సమావేశం అనంతరం పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవత్‌ మాన్‌ మాట్లాడుతూ పంటల వైవిధ్యీకరణ చాలా ముఖ్యమన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం ఎంఎస్పీ హామీ ఇస్తుందని.. ఇతర పంటలకు తీసుకురావొచ్చన్నారు. కేంద్రం ప్రతిపాదనపై రైతు సంఘాల స్పందన కోసం వేచి చూస్తామన్నారు. అయితే, ఎంఎస్‌పీ కోసం చట్టపరమైన హామీ కోసం కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకురావాలని రైతు సంఘాలు ఇంతకుముందు స్పష్టం చేశాయి. సమావేశంలో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, వ్యవసాయ శాఖ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుద్దియాన్ హాజరయ్యారు.


కేంద్రంతో అర్ధరాత్రి వరకు జరిగిన నాలుగో దఫా చర్చలు ఫలప్రదమయ్యాయని, ప్రస్తుతం ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను నిలిపివేస్తున్నట్లు పంజాబ్‌ కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్‌ పంధేర్‌ తెలిపారు. కేంద్రం ప్రతిపాదనలతో రైతులతో చర్చిస్తామని, నిపుణుల అభిప్రాయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. దీనిపై మరోసారి రాబోయే రెండురోజుల్లో చర్చిస్తామన్నారు. సానుకూల ఫలితం కోసం ఆశిస్తున్నామని.. లేకపోతే ఢిల్లీ చలో మార్క్‌ కొనసాగుతుందన్నారు.


అయితే, చర్చల్లో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ పంచవర్ష ప్రణాళికను ప్రతిపాదించారు. నాఫెడ్‌, సీసీఐ రైతులతో రాబోయే ఒప్పందం చేసుకొని.. వచ్చే ఐదేళ్లపాటు పంటను ఎంఎస్‌పీకి కొనుగోలు చేయనున్నట్లు గోయల్‌ తెలిపారు. అయితే, కొనుగోలు పరిమాణంపై ఎలాంటి పరిమితి ఉండదని తెలిపారు. దీని కోనం పోర్టల్‌ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చట్టపరమైన ఒప్పందం ద్వారా ఐదేళ్లపాటు ఎంఎస్‌పీతో రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రతిపాదించింది.


మరో వైపు పంటలకు మద్దతు ధరను డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాలు ఈ నెల 13న ఢిల్లీ చలో మార్చ్‌కు పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా సహా 200పైగా రైతు సంఘాలు పాల్గొన్నారు. రైతులు పంజాబ్‌, హర్యానా సరిహద్దులోని శంభు, ఖనౌరీ పాయింట్ల వద్ద బైఠాయించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, రైతులకు, రైతు కూలీలకు పెన్షన్లు ఇవ్వాలని, రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version