MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు (Delhi liquor scam Case)లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తనయ, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లు (summons) జారీ చేసింది. లిక్కర్ పాలసీ కేసులో గురువారం విచారణకు రావాలంటూ బుధవారం నోటీసులు జారీ చేసింది. మంగళవారం అరుణ్ రామచంద్ర పిళ్లైని విచారించి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలను ఈడీ ప్రస్తావించింది. విచారణలో అరుణ్ పిళ్లై తాను కవిత బినామీనంటూ ఒప్పుకున్నారని ఈడీ పేర్కొంది. కవిత ఆదేశాల మేరకే ఆయన పని చేసినట్లుగా తెలిపింది.
కవిత ప్రయోజనాల కోసమే అరుణ్ పిళ్లై ఇండో స్పిరిట్స్‌లో 32.5 శాతం మేరకు భాగస్వామిగా ఉన్నారని చెప్పింది. కుంభకోణంలో అరుణ్ పిళ్లైదే కీలక పాత్ర అని, తదుపరి విచారణ నిమిత్తం ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాది కోరగా.. ఏడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. మరోవైపు ఇదే కేసులో తిహార్ జైలులో ఉన్న మనీష్ సిసోడియాను మంగళవారం ఈడీ అధికారులు విచారించారు. కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును మరోసారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 10న ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించాలంటూ ధర్నా చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే గురువారం ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈడీ నోటీసులు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇదే కేసులో సీబీఐ అధికారులు కవితను విచారించిన విషయం తెలిసిందే.