ముంబై : ఓ మహిళకు వివాహమై మూడేండ్లు అవుతుంది. కానీ ఆమెకు సంతానం కలగలేదు. బంధువుల సూటిపోటి మాటలు భరించలేని ఆమె.. చివరకు ఓ 20 రోజుల పసికందును కిడ్నాప్ చేసింది. ఈ ఘటన మహారాష్ట్ర కందివాలీలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రిలో వెలుగు చూసింది.
కందివాలీ ఏరియాకు చెందిన ఓ 21 ఏండ్ల మహిళ కొద్ది రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పలు కారణాల రీత్యా డెలివరీ అయినప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలోనే ఉంటోంది. అయితే 26 ఏండ్ల వయసున్న రింకీ ఆస్పత్రిని సందర్శించి, ఆమెతో పరిచయం పెంచుకుంది. ఆ శిశువును ఎలాగైనా కిడ్నాప్ చేయాలని రింకీ నిర్ణయించుకుంది. అయితే రింకీకి వివాహమై మూడేండ్లు అవుతున్నప్పటికీ సంతానం కలగలేదు.
ఇక శిశువు తండ్రి ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లగా, తల్లేమో వాష్‌రూమ్‌కు వెళ్లింది. ఆ సమయంలో తన బిడ్డను కాసేపు చూసుకోవాలని రింకీకి చెప్పి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన రింకీ ఆ శిశువును ఎరుపు రంగు వస్త్రంలో చుట్టుకుని ఆస్పత్రి నుంచి పరారైంది. తన బిడ్డ బెడ్‌పై లేకపోవడంతో తల్లి ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ పసిబిడ్డ ఏడ్వడంతో రింకీ సమీపంలోని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయింది. శిశువును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా, అక్కడ రోడ్డుపై ఉన్న శిశువును గుర్తించారు. అనంతరం పసిబిడ్డను తల్లీదండ్రులకు అప్పగించారు. రింకీని పోలీసులు అరెస్టు చేశారు. చేసిన నేరాన్ని రింకీ అంగీకరించింది.