అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లో భాంగ్రా డ్యాన్స్‌ చేస్తున్న డైనోసార్లు.. ఎక్కడంటే..

డైనోసార్లు భాంగ్రా డ్యాన్స్‌ చేస్తున్నాయి..

  • Publish Date - February 25, 2024 / 03:03 PM IST

భాంగ్రా డ్యాన్స్‌లో కిక్కే వేరు. ఆ డ్యాన్స్‌కు కొట్టే మ్యూజిక్‌.. ఆ డ్యాన్స్‌ చేసే తీరు.. ఉర్రూతలూగిస్తుంది. పంజాబీ సంస్కృతిలో భాంగ్రా నృత్యానికి ఉన్న స్థానం మరో నృత్యానికి ఉండదంటే అతిశయోక్తి కాదు. పంటలు కోసిన కాలంలో రైతులంతా వేడుకలు చేసుకునేందుకు ఈ నృత్యాలు చేస్తుంటారు. అదే కాదు.. ఏ సంతోషకర కార్యక్రమమైనా.. భాంగ్రా డ్యాన్స్‌ అక్కడ ఉంటుంది. అయితే.. సాధారణంగా మనుషులు చేసే ఈ భాంగ్రా నృత్యాన్ని పాకిస్థాన్‌లోని ఒక అమ్యూజ్‌మెంట్‌ పార్కులో డైనోసార్లు చేయడం విశేషం. ఈ దృశ్యం చూసేందుకే ఆ పార్క్‌కు అత్యధిక సంఖ్యలో సందర్శకులు వస్తుంటారట.

డైనోసార్లు అనగానే.. భారీ కాయాలతో ఉండే జీవులు గుర్తుకొస్తాయి. అయితే.. ఇవి ఎప్పుడో అంతరించిపోయాయి. వీటిని సినిమాల్లో చూసినా ఇప్పటికీ దడుచుకునేవారు ఉంటారు. మరి అలాంటి డైనోసార్లు డ్యాన్స్‌ చేస్తే.. అది కూడా పంజాబీ స్టైల్లో భాంగ్రా డ్యాన్స్‌ చేస్తే.. చూడటానికి రెండు కళ్లు చాలవు. అటువంటి నృత్యం చూడాలంటే పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో గల డైనో వరల్డ్‌కు వెళ్లాల్సిందే. ఈ మధ్య అక్కడ డైనోసార్‌లు.. (ఆ వేషంలో మనుషులు) భాంగ్రా డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌ అయింది. ధూంధాంగా సాగే పంజాబీ సాంగ్‌కు అనుగుణంగా అవి స్టెప్పులేయడం ఆ వీడియోలో ఉన్నది. డైనోసార్‌ కాస్ట్యూమ్‌ ధరించి కొందరు భాంగ్రా నృత్యం చేస్తుంటే.. సందర్శకులు నవ్వుల్లో మునిగిపోయారు. ఈ వీడియో చూసిన కొందరు.. జురాసిక్‌ పార్క్‌ సినిమాను గుర్తుకు తెస్తూ ‘జురాసిక్‌పూర్‌’ అంటూ కామెంట్లు పెట్టారు.

Latest News