Reheat Tea | వేకువజాము నుంచి మొదలుకుంటే రాత్రి పడుకునే వరకు అనేకసార్లు టీ తాగే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారు టీ షాపు ఎక్కడా కనిపించినా తాగేస్తుంటారు. ఇంట్లో కూడా ఒకసారి చేసిన టీని మళ్లీ మళ్లీ మరిగించి తాగేస్తుంటారు. ఇలాంటి వారు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే. టీ మళ్లీ మళ్లీ వేడి చేసి తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు సంభవించే అవకాశం ఉందనే విషయాన్ని గ్రహించాలి.
- పొద్దున్నే ఒక ఐదారు కప్పుల చాయ్ రెడీ చేస్తారు. అదే చాయ్‌ను మళ్లీ మళ్లీ మరగబెట్టి తాగుతుంటారు. హోటల్స్‌లో కూడా అదే మాదిరి చేస్తుంటారు. ఇలా టీని పదేపదే వేడి చేసి తాగడం వల్ల మంచిది కాదు. రుచి, వాసన కోల్పోతుంది. అంతేకాదు టీలో ఉండే పోషకాలు, ఖనిజాలు తగ్గిపోతాయి.
- ముఖ్యంగా నాలుగు గంటల కంటే ఎక్కువ సేపు ఉంచిన టీని తర్వాత మళ్లీ వేడి చేసి తాగడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. దానిలో బ్యాక్టీరియా పెరిగిపోయి.. ఫంగస్ వృద్ధి చెందుతుందనే విషయాన్ని గ్రహించాలి.
- చాయ్‌ని మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల బ్యాక్టీరియా ఎక్కువ శాతం విడుదలై.. రుచి లేని గుణాన్ని ఇస్తుంది. దీంతో అతిసారం, తిమ్మిర్లు, కడుపు ఉబ్బరం, వికారం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. వీటిని తేలికగా తీసుకుంటే ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. లేదా ఒకేసారి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది.
- టీని తయారు చేసేటప్పుడు కేవలం 15 నిమిషాల వరకు మాత్రమే వేడి చేసుకోవచ్చు. ఆ సమయం వరకు బ్యాక్టీరియా వృద్ధి చెందకపోవచ్చు. 4 గంటలకు మించి ఎక్కువసేపు ఉంచిన టీని మళ్లీ మాత్రం వేడి చేయకూడదని మరచిపోకండి. ఇది చాలా హానికరం. మీకు అవసరమైనంత టీని మాత్రమే సిద్ధం చేసుకోండి. టైమ్ కలిసి వస్తుందని ఒకేసారి పెట్టుకుని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకోకండి.