న్యూఢిల్లీ: ప్రశ్నల కుంభకోణం ఉదంతంలో తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించారు. ఈ విషయంలో శుక్రవారం లోక్‌సభకు ఎథిక్స్ కమిటీ నివేదిక సమర్పించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత తిరిగి సమావేశమైన లోక్‌సభలో ఈ అంశంపై ఓటింగ్ నిర్వహించారు. సభ ఆమోదంతో ఆమెను బహిష్కరించారు. ఈ మేరకు తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రవేశపెట్టగా సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి, తృణమూల్ ఎంపీలు కల్యాణ్ బెనర్జీ, సుదీప్ బందోపాధ్యాయ, జేడీయూ ఎంపీ గిరిధరి యాదవ్ కమిటీ నివేదికను వ్యతిరేకించారు. మరోవైపు బీజేపీ ఎంపీ డాక్టర్ హీనా వీ గావిట్, అపరాజిత సారంగి నివేదికను సమర్థించారు.
అంతకు ముందు మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు తన నివేదికను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా వాయిదా పడిన సభ తిరిగి ప్రారంభమైన అనంతరం ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్ తమ నివేదికను సభ ముందు ఉంచారు. ‘మహువా మొయిత్రా తీవ్ర దుష్ప్రవర్తనకు కఠిన శిక్ష ఉండాలి. అందుకే మహువాను 17వ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కమిటీ సిఫారసు చేస్తున్నది’ అని నివేదికలో పేర్కొన్నారు.
మొయిత్రా తీవ్ర అభ్యంతరకర, అనైతిక, హేయమైన, నేరపూరిత ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని ఆమెపై నిర్దిష్ట కాలపరిమితిలో న్యాయపరమైన, సంస్థాగత విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. ఈ నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టగానే పలువురు టీఎంసీ, కాంగ్రెస్ సభ్యలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. నివేదిక కాపీ సభ్యులకు అందజేయాలని నినాదాలు చేశారు. కమిటీ నివేదికపై ఓటింగ్ నిర్వహించే ముందు ఈ అంశంపై సభలో చర్చించాలని తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ డిమాండ్ చేశారు. ఈ సమయంలో సభలో గందరగోళం నెలకొనడంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న బీజేపీ సభ్యుడు రాజేంద్ర అగర్వాల్.. సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఇదిలా ఉంటే.. నివేదికను ప్రవేశపెట్టిన అనంతరం మహువా మొయిత్రా పార్లమెంటు నుంచి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఏం జరగాలో అది జరుగుతుంది’ అని ఆమె వ్యాఖ్యానించారు.
నవంబర్ 9న జరిగిన ఎథిక్స్ కమిటీ సమావేశం మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని తీర్మానించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో కాంగ్రెష్ ఎంపీ ప్రణీత్‌కౌర్ సహా ఆరుగురు సభ్యులు ఉన్నారు. కమిటీ సమావేశంలో నివేదికకు అనుకూలంగా ఓటు వేసినందుకు ఆమెను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ప్రతిపక్షానికి చెందిన నలుగురు సభ్యులు నివేదికను వ్యతిరేకించారు. నిజానికి ఈ నెల 4వ తేదీన నివేదికను లోక్‌సభకు సమర్పించాల్సి ఉన్నప్పటికీ.. వీలుకాలేదు.
ఆధారాల్లేకుండా చర్యలా?
తన బహష్కరణ అనంతరం మీడియాతో మాట్లాడిన మహువా మొయిత్రా.. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఎథిక్స్ కమిటీ వ్యవహరించిందని ఆరోపించారు. ప్రతిపక్షం లేకుండా చేయడానికి ఎథిక్స్ కమిటీ ఒక ఆయుధంగా తయారైందని విమర్శించారు. ఎథిక్స్ కమిటీ, దాని నివేదిక రూల్‌బుక్‌లోని ప్రతి నిబంధనను ఉల్లంఘించాయని ఆమె మండిపడ్డారు. ఒక పార్లమెంటరీ కమిటీని ఆయుధంగా మార్చిన తీరును లోక్‌సభ చూసిందని అన్నారు. సభ్యుల నైతిక ప్రవర్తనకు మార్గదర్శిగా ఉండాల్సిన కమిటీ.. ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టేసేందుకు అధికార పక్షం చేతిలో ఆయుధంగా తయారైందని విమర్శించారు. తాను నైతిక విలువలను ఉల్లంఘించానని కమిటీ చెప్పడాన్ని తప్పుపట్టిన మొయిత్రా.. అసలు ఇక్కడ నైతికత అంటూ ఉన్నదా? అని సూటిగా ప్రశ్నించారు.