Site icon vidhaatha

Tirumala Cheetah | తిరుమలలో చిన్నారిని చంపిన చిరుత గుర్తింపు..! దాని విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న అధికారులు..!

Tirumala Cheetah | తిరుమల నడక మార్గంలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే చిన్నారిని చిరుత దాడి చేసిన చంపేసిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు చిన్నారిపై దాడి చేసిన చిరుతను అధికారులను గుర్తించారు. దాడి ఘటన అనంతరం టీటీడీ, అటవీశాఖ సంయుక్తంగా ఆరు చిరుతలను బోనులో బంధించిన విషయం తెలిసిందే. అయితే, నడక మార్గంలో ఏడో నంబర్‌ మలుపు వద్ద బోనులో చిక్కిన చిరుతనే బాలికపై దాడి చేసినట్లుగా తేల్చారు. సెప్టెంబర్‌ 20న చిరుత చిక్కగా.. ఇదే బాలికపై దాడి చేసినట్లు డీఎన్‌ఏ పరీక్షల్లో రుజువైంది.

బాలిక శరీరంపై గాయాలతో పాటు డీఎన్‌ఏ పరీక్షల ద్వారా దాడి చేసింది ఏ చిరుతనో నిర్ధారణకు వచ్చారు. దాడికి పాల్పడిన చిరుతను ఇక ఎస్వీ జూకే పరిమితం చేసి.. అటవీశాఖ సంరక్షణలో ఉంచనున్నారు. మిగతా చిరుతలను శేషాచలం, నంద్యాల అటవీ ప్రాంతాల్లో వదిలేయనున్నారు. ఇప్పటికే మూడు చిరుతలను అధికారులు వదిలేసిన విషయం తెలిసిందే. ఇందులో ఒకటి పిల్ల కావడంతోనే చిక్కిన సమయంలోనే అటవీ ప్రాంతంలో వదిలేశారు.

ఇదిలా ఉండగా.. గతేడాది ఆగస్టు 11న అలిపిరి నడక మార్గం నుంచి తిరుమలకు వెళ్తున్న ఆరేళ్ల లక్షిత అనే బాలికపై చిరుత దాడి చేసింది. రాత్రి 8 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి లక్షిత మెట్లమార్గం ద్వారా దర్శనానికి బయలుదేరి వెళ్లారు. కుటుంబ సభ్యుల కన్నా ముందు నడుచుకుంటూ వెళ్తున్న బాలికపై చిరుత దాడి చేసింది.

మరుసటి రోజు లక్ష్మీనారసింహస్వామి ఆలయ సమీపంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనతో షాక్‌కు గురైన తిరుమల తిరుపతి దేవస్థానం.. అటవీశాఖ సహకారంతో చిరుతలను బంధించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నెలరోజుల్లో ఆరు చిరుతలను బంధించింది. నడకమార్గంలో సంచరిస్తున్న చిరుతలను బంధించి.. వాటిని సురక్షిత అటవీ ప్రాంతానికి తరలించారు. నడక మార్గాల్లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతల కదలికల్ని గుర్తిస్తూ.. నడక మార్గంలో వెళ్లే భక్తులపై ఆంక్షలు విధిస్తూ వచ్చారు.

అయితే, శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 45 వరకు చిరుతలున్నట్లుగా అంచనా. ఇందులో కొన్ని మెట్ల మార్గానికి సమీపంలోకి వస్తున్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. గత జూన్‌లో చిరుత బాలుడిని ఎత్తుకువెళ్లేందుకు ప్రయత్నించింది. గమనించిన పోలీసులు పెద్ద ఎత్తున శబ్దాలు చేస్తూ వెంబడించడంతో బాలుడిని వదిలేసి పారిపోయింది. ఆ తర్వాత బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Exit mobile version