విధాత, హైదరాబాద్: ధరణి వెబ్‌పోర్టల్‌తో తలెత్తిన భూమి సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీనీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం సీసీఎల్ ఏ మెంబర్ కన్వినర్‌గా నలుగురు సభ్యులతో కమిటీనీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో పని చేయనున్నది. ఈ కమిటీలో సభ్యలుగా జాతీయ కాంగ్రెస్ సెల్ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, మాజీ సీసీఎల్ ఏ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, రేమండ్ పీటర్, భూమి నిపుణులు, న్యాయవాది భూమి సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి. మధుసూధన్‌లు సభ్యులుగా సీసీఎల్ ఏ, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఈ కమిటీకి మెంబర్ కన్వినర్‌గా వ్యవహరిస్తారు.
సమగ్రంగా అధ్యయనం
ఈ కమిటీ ధరణిలో ఏర్పడిన సమస్యలు ఏమిటీ? అవి పరిష్కారం ఎందుకు కాలేక పోయాయి. కొత్త సమస్యలు ఏమి వచ్చాయో అద్యయనం చేయనున్నది. అలాగే ధరణి వెబ్ సైట్ నిర్వాహకులు ఎవరు? ఎవరి చేతుల్లో ఉంది. ధరణి డేటా భద్రంగా ఉందా? లేక ప్రవేట్ వ్యక్తుల చేతుల్లో పడి భూ రికార్డులు తారు మారు అయ్యాయా? ధరణిలో జరిగిన అక్రమ లావాదేవీలు ఏమిటీ? ఎలా జరిగాయి? రాత్రిళ్లు రిజిస్ట్రేషన్లు, ఉదయం పూట నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఏమిటీ? ఇలా చేసిన వారు ఎవరు? చేయించిన వారు ఎవరు? ఏ విధంగా జ రిగాయన్న వివరాలపై పూర్తిగా అద్యయనం చేసి, సర్కారుకు ఈ కమిటీ నివేదిక ఇవ్వనున్నది. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ఏమి చేయాలన్న దానిపై కూడా సలహాలు, సూచనలు ఈ కమిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు వివిధ రైతు ప్రతినిధులు, భూమి సమస్యలపై పనిచేస్తున్న న్యాయ నిపుణులు, క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులందరితో మాట్లాడి ఏమి చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. దీంతోపాటు పౌర సమాజంతో కలిసి ఏదైనా ఒక మండంలో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టి, దాని ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలన్న యోచన కూడా సర్కారు చేస్తోందని సమాచారం.
ధరణితో లక్షల్లో సమస్యలు
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల అనేక సమస్యలు ఏర్పడ్డాయి. 90 శాతంపైగా భూమి సమస్యలు తీరాయని కేసీఆర్ చెబితే అందుకు భిన్నంగా లక్షల్లో సమస్యలున్నాయని తేలింది. అయినప్పటికీ నాటి సీఎం కేసీఆర్ ధరణిలో భూ సమస్యలున్నాయని అంగీకరించలేదు. న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నా పట్టించుకోలేదు. ధరణిలో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టి నాగులపల్లి గ్రామంలో జరిగిన లావాదేవీలపై వై జైహింద్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి లక్ష్మన్ ఆనాడు సీసీఎల్ఏను కోర్టుకు పిలిచి ధరణిలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించి, అమలు నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. దీనిపై శుక్రవారం విచారించిన కోర్టు ఎందుకు నివేదిక సమర్పించలేదని అడిగింది. ధరణి పోర్టల్‌ను ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదో చెప్పాలని ఏజీ సుదర్శన్‌రెడ్డిని ఆదేశిస్తూ కేసు విచారణను ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ప్రభుత్వం ధరణిపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే శర వేగంగా కమిటీని వేసి అధ్యయనం చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.