Site icon vidhaatha

నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ‌కు విముక్తి : గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

హైద‌రాబాద్ : నియంతృత్వ పాల‌న నుంచి తెలంగాణ విముక్తి పొందింది అని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ పేర్కొన్నారు. మార్పు కోసం తెలంగాణ ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన తీర్జు ఇచ్చారు. ఈ ప్ర‌భుత్వంలో తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది. పాల‌కులు, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య ఇనుప కంచెలు తొలిగాయి. అడ్డుగోడ‌లు, అద్దాల మేడ‌లు పటాపంచ‌లై ప్ర‌జా ప్ర‌భుత్వ ప్ర‌స్థానం మొద‌లైంది. పౌర‌హ‌క్కులు, ప్ర‌జాహ‌క్కుల‌కు నాంది ప‌డింది. పాల‌కులు ప్ర‌జా సేవ‌కులే త‌ప్ప పెత్తందార్లు కాదు అని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు. ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగించారు. కాళోజీ నారాయ‌ణ రావు కవిత‌తో గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించారు.


మూడు కోట్ల మేటి ప్ర‌జ‌ల‌

గొంతొక్క‌టి కోరికొక్క‌టి

తెలంగాణ వెల‌సి నిలిచి

ఫ‌లించాలె భార‌తాన‌!


అని పేర్కొంటూ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని చ‌దివి వినిపించారు.


మంత్రులు, ఎమ్మెల్యేల‌కు గ‌వ‌ర్న‌ర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేరాల‌ని కోరుతున్నా. ప్ర‌జాసేవ‌లో విజ‌యం సాధించాల‌ని కొత్త ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాన‌ని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు. అణిచివేత‌, అప్ర‌జాస్వామిక పోక‌డ‌ల‌ను తెలంగాణ ప్ర‌జ‌లు స‌హించ‌రు. కొత్త ప్ర‌భుత్వం ప్ర‌జా ప్ర‌భుత్వం. ప్ర‌జా ఫిర్యాదులు స్వీక‌రించేందుకు ప్ర‌జావాణి చేప‌ట్టాం. ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌లు నెర‌వేర్చే దిశ‌గా కృషి చేస్తాం. త‌మ జీవితాల్లో మార్పు కావాల‌ని ప్ర‌జ‌లు కోరుకున్నారు. మీ ప్ర‌యాణం ప్ర‌జాసేవ‌కు అంకితం కావాల‌ని కోరుకుంటున్నాను. రైతులు, యువ‌త‌, మ‌హిళ‌ల‌కు ఈ ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త ఇస్తుంది. దేశానికే తెలంగాణ పాల‌న ఆద‌ర్శం కావాలి. ప్ర‌జ‌లంద‌రికీ స‌మాన అవ‌కాశాలు క‌ల్పించాలి.


ఇది ప్ర‌జా ప్ర‌భుత్వం.. మాది ప్ర‌జ‌ల పాల‌న‌. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు చెప్పుకునేందుకు అవ‌కాశం క‌ల్పించాం. ఇది సామాన్యుడి ప్ర‌భుత్వ‌మ‌ని గ‌ర్వంగా చెప్పుకునే ప‌రిస్థితి ఉంది. మా పాల‌న దేశానికే ఆద‌ర్శం కాబోతుంది. 4 కోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌తో ఏర్ప‌డిన రాష్ట్రం ఇది. అమ‌ర‌వీరుల ఆకాంక్ష‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని పాల‌న సాగిస్తాం. రాష్ట్రం కోసం ప్రాణ‌త్యాగం చేసిన వారికి స‌భా వేదిక‌గా నివాళి అర్పిస్తున్నాం. ప్ర‌జా సంక్షేమం కోస‌మే ఆరు గ్యారెంటీలు ప్ర‌క‌టించాం. హామీల‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించే ద‌స్త్రంపై తొలి సంత‌కం చేశారు. తొలి అడుగులోనే సంక్షేమానికి మా ప్ర‌భుత్వం నాంది ప‌లికింది. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ప్ర‌తిమాట‌కు మా ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది అని గ‌వ‌ర్న‌ర్ స్ప‌ష్టం చేశారు.


24 గంట‌ల క‌రెంట్, రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ

రాష్ట్ర రైతాంగాన్ని త‌ప్ప‌కుండా ఆదుకుంటామ‌ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ స్ప‌ష్టం చేశారు. 24 గంట‌ల క‌రెంట్ ఇచ్చేందుకు మా ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని తేల్చిచెప్పారు. రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీపై త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌తి పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర ఇచ్చి కొనుగోలు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగించారు.

మా ప్ర‌భుత్వం బాధ్య‌త‌లు స్వీక‌రించిన 48 గంట‌ల్లోనే రెండు గ్యారెంటీలు అమ‌లు చేసింది. ప్ర‌తి ఆడ‌బిడ్డ‌ను మ‌హాల‌క్ష్మిగా చేయాల‌నేదే మా ప్ర‌భుత్వ ఆలోచ‌న‌. డిసెంబ‌ర్ 9వ తేదీన మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కం కింద రాష్ట్రంలోని మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం క‌ల్పించే ప‌థ‌కానికి శ్రీకారం చుట్టాం. ప్ర‌జల ఆరోగ్య భ‌ద్ర‌త‌.. మా ప్ర‌భుత్వానికి అత్యంత ప్రాధాన్యం. రాజీవ్ ఆరోగ్య‌శ్రీని ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు తీర్చిదిద్దాం. రాజీవ్ ఆరోగ్య శ్రీ ప‌రిధిని రూ. 10 ల‌క్ష‌ల‌కు పెంచాం.


వ‌చ్చే వంద రోజుల్లో మిగ‌తా గ్యారెంటీల అమ‌లుకు కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నాం. ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో చెప్పిన ప్ర‌తి హామీకి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది. ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ ప్ర‌క‌టించిన అన్ని డిక్ల‌రేష‌న్లు అమ‌లు చేస్తాం. రైతుల కోసం ప్ర‌క‌టించిన వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్, హైద‌రాబాద్‌లో ప్ర‌క‌టించిన యువ డిక్ల‌రేష‌న్, చేవేళ్ల‌లో ప్ర‌క‌టించిన బీసీ డిక్ల‌రేష‌న్ అన్ని క‌చ్చితంగా అమ‌లు చేస్తామ‌ని ప్ర‌జ‌ల‌కు మాట ఇస్తున్నామ‌ని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు.

అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు 250 గ‌జాల ఇంటి స్థ‌లం..

అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు 250 గ‌జాల ఇంటి స్థ‌లం, గౌర‌వ‌భృతి ఇస్తాం అని గ‌వ‌ర్న‌ర్ స్ప‌ష్టం చేశారు. వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల విద్యుత్ ఇచ్చేందుకు మా ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది. ప్ర‌తి పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తాం. రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీపై త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ ఉంటుంది. అసైన్డ్, పోడు భూముల‌కు త్వ‌ర‌లోనే ప‌ట్టాల పంపిణీ చేప‌డుతాం. కాళేశ్వ‌రం, మేడిగ‌డ్డ‌, అన్నారం బ్యారేజీల్లో అవినీతిపై విచార‌ణ జ‌రిపిస్తాం.


కృష్ణా న‌దీ జ‌లాల్లో తెలంగాణ‌కు ద‌క్కాల్సిన న్యాయ‌మైన వాటా సాధ‌న‌కు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది. పాల‌మూరు ఎత్తిపోత‌ల‌కు జాతీయ హోదా సాధించాల‌న్న‌ది మా సంక‌ల్పం. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి పాల‌మూరు, రంగారెడ్డి, న‌ల్ల‌గొండ జిల్లాల‌ను స‌స్య‌శ్యామ‌లం చేస్తాం. గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రారంభించిన అంబేద్క‌ర్ ప్రాణ‌హిత – చేవేళ్ల‌ను పూర్తి చేసి ఎగువ ప్రాంతాలైన ఆదిలాబాద్, ఇత‌ర జిల్లాల‌కు సాగునీరు ఇవ్వాల‌న్న‌ది మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు

Exit mobile version