238 సార్లు ఓట‌మి.. ఇప్పుడు గెలిస్తే గుండెపోటుతో చ‌నిపోతానేమో..!

స‌ర్పంచ్ ఎన్నిక‌ల నుంచి మొద‌లుకుంటే.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల వ‌ర‌కు ఏకంగా 238 సార్లు పోటీ చేశారు. కానీ ఏ ఒక్క ఎన్నిక‌లోనూ విజ‌యం సాధించ‌లేదు. 238 సార్లు ఓడినా కూడా మ‌ళ్లీ ఇప్పుడు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు 'ఎల‌క్ష‌న్ కింగ్'.

  • Publish Date - March 29, 2024 / 03:03 AM IST

చెన్నై : సామాజిక స్పృహ క‌లిగి ఉండి, ప్ర‌జా సేవ చేయాల‌నుకునే ప్ర‌తి ఒక్క‌రూ చ‌ట్ట స‌భ‌ల్లో అడుగు పెట్టాల‌ని అనుకుంటారు. అందుకోసం ఆయా రాజ‌కీయ పార్టీల నుంచి లేదా స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా ఎన్నిక‌ల బ‌రిలో దిగుతారు. ఒక వేళ గెలిస్తే ప్ర‌జాసేవ‌లో నిమ‌గ్న‌మై, నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి పాటుప‌డుతారు. ఒక వేళ ఓట‌మి పాలైతే.. మ‌రో ఎన్నిక కోసం వేచి చూస్తుంటారు. మ‌ళ్లీ మ‌ళ్లీ ఓడిపోతే.. రాజ‌కీయాలు మ‌న‌కు వ‌ద్ద‌నుకుని గుడ్‌బై చెబుతుంటారు. కానీ ఈయ‌న మాత్రం మ‌ళ్లీ మ‌ళ్లీ ఓడినా.. మొండి ప‌ట్టుద‌ల‌తో ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. స‌ర్పంచ్ ఎన్నిక‌ల నుంచి మొద‌లుకుంటే.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల వ‌ర‌కు ఏకంగా 238 సార్లు పోటీ చేశారు. కానీ ఏ ఒక్క ఎన్నిక‌లోనూ విజ‌యం సాధించ‌లేదు. 238 సార్లు ఓడినా కూడా మ‌ళ్లీ ఇప్పుడు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు ‘ఎల‌క్ష‌న్ కింగ్’.

వివ‌రాల్లోకి వెళ్తే.. త‌మిళ‌నాడులోని మెట్టూరుకు చెందిన కే ప‌ద్మ‌రాజ‌న్(65).. 1988లో తొలిసారిగా ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. కానీ ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఆశించిన ఫ‌లితం రాలేదు. అయినా కూడా నిరాశ చెంద‌కుండా ప్ర‌తి ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 238 సార్లు పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. అయినప్పటికీ తనకు గెలుపు ముఖ్యం కాదని ఎన్నికల్లో పోటీ చేయడమే ప్రధానమని చెబుతున్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని ధర్మపురి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యాడు. 2011లో బెస్ట్ ఫ‌ర్మార్మెన్స్ చూపించారు. మెట్టూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయ‌గా, 6,273 ఓట్లు సాధించారు. 

ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డ‌మే నా విజ‌యం..

కాగా, ‘ఎలక్షన్ కింగ్’గా పేరుగాంచిన పద్మరాజన్, స్థానిక ఎన్నిక‌ల నుంచి రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల వ‌ర‌కు దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వంటి రాజకీయ ఉద్ధండులపై కూడా పోటీ చేసి ఓడిపోయాడు. అభ్యర్థులంతా ఎన్నికలలో విజయం సాధించాలని కోరుకుంటారు. నేను మాత్రం కాదు. ఎన్నికల్లో పోటీ చేయడమే నా విజయం. ఓటమి పరంపరలో మళ్లీ ఓడిపోయినా సంతోషమే అని ప‌ద్మ‌రాజ‌న్ పేర్కొన్నారు.

ఎన్నిక‌ల్లో ఓడినా.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో విజ‌యం

మరోవైపు టైర్ రిపేర్ షాప్‌ నిర్వహించే పద్మరాజన్ హోమియోపతి మందుల అమ్మకంతోపాటు స్థానిక మీడియాకు ఎడిటర్‌గా కూడా పనిచేస్తున్నాడు. ఎన్నికల్లో నామినేషన్‌ కోసం ఇప్పటి వరకు లక్షలు చెల్లించిన అతడు అన్నిసార్లు డిపాజిట్‌ కోల్పోయాడు. కాగా, ఇప్పటి వరకు పోటీ చేసిన అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన పద్మరాజన్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మాత్రం విజయం సాధించారు. అత్యంత ఓటమి అభ్యర్థిగా రికార్డుకెక్కారు. ఈ నేపథ్యంలో తన ఊపిరి ఉన్నంత వరకు ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని చెప్పారు. ఒకవేళ ఎప్పుడైన తాను గెలిస్తే గుండెపోటుతో చనిపోతానేమోనంటూ నవ్వుతూ అన్నారు ప‌ద్మ‌రాజ‌న్.

Latest News