హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం ఎన్నికల సంఘం కల్పించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 85 ఏళ్లు వయసు పైబడిన వారితో పాటు 40 శాతానికి పైగా అంగ వైకల్యం ఉన్న ఓటర్లు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు. మరి దరఖాస్తు ఎలా చేసుకోవాలి..? ఓటు వేసే విధానం ఏంటో తెలుసుకుందాం..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక ఇంటి నుంచి ఓటు వేయాలనుకున్న వృద్ధులు, వికలాంగులు.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఐదు రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. అంటే ఏప్రిల్ 22 లోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన ఓటర్లు ఫారం 12డీ నింపి రిటర్నింగ్ అధికారికి గానీ, సహాయ రిటర్నింగ్ అధికారికి గానీ పంపించాలి. దరఖాస్తు చేసుకున్న ఓటర్లు తమ పూర్తి చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ తప్పనిసరిగా పొందుపరచాలి. ఫారం 12డీని ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఓటర్లను పరిశీలించిన తర్వాతే ఓటింగ్‌కు అవకాశం..
ఓటర్ల దరఖాస్తులను అందుకున్న అధికారులు.. చిరునామా ఆధారంగా బూత్ లెవల్ అధికారులు వారి నివాసాలకు పంపిస్తారు. దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు 85 ఏండ్లు నిండాయా..? ఇక దివ్యాంగులు 40 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్నారా..? వంటి అంశాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత వారికి ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయం కల్పించాలా..? వద్దా..? అనేది నిర్ణయిస్తారు. ఆ తర్వాత ఫారం 12డీని రిటర్నింగ్ ఆఫీసర్‌కు అందజేస్తారు. అర్హత ఉంటే దరఖాస్తులదారుల ఇంటికి అధికారులే వెళ్లి ఓటు వేయిస్తారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేటప్పుడు ఎలాగైతే రహస్య ఓటింగ్ ఉంటుందో ఇంటి నుంచి ఓటు వేసేటప్పుడు కూడా ఆ నిబంధనలు పాటిస్తారు.
నామినేషన్ల ఉపసంహరణ తర్వాతే హోమ్ ఓటింగ్..
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ 2.09 లక్షల మంది పోస్టల్, హోం ఓటింగ్‌ను వినియోగించుకున్నారు. రాష్ట్రంలో 85 ఏండ్లు దాటిన వృద్ధులు 1.85 లక్షల మంది, దివ్యాంగ ఓటర్లు 5.26 లక్షల మంది ఉన్నారు. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మూడు, నాలుగు రోజుల్లో హోమ్ ఓటింగ్‌కు అవకాశం కల్పించనున్నారు.