కాఫీ.. చాలా మంది ఇష్టపడుతుంటారు. కొందరు ఉదయం లేవగానే బ్రష్ చేసి కాఫీ తాగేస్తుంటారు. ఇంకొందరైతే బ్రేక్ ఫాస్ట్ ముగించాక కాఫీ తీసుకుంటుంటారు. ఇక చాలా మంది తమ ఆఫీసుల్లో రిలాక్స్ కోసం కాఫీ సేవిస్తుంటారు. బయట ఫ్రెండ్స్ కలిసినా కూడా కాఫీ ఆర్డర్ చేస్తుంటారు. అలసట, తలనొప్పితో బాధపడే వారు కూడా కాఫీ తాగుతారు. ఇలా కాఫీని రోజుకు నాలుగైదు సార్లకు పైగానే తీసుకుంటుంటారు. ఇలా రోజుకు నాలుగైదు సార్లు కాఫీ తాగే వారికి అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే రోజూ ఎక్కువగా కాఫీ తాగడం వల్ల నిద్రలేమి సమస్య ఏర్పడుతుందట. కంటి నిండా నిద్రకు దూరమయ్యే అవకాశం ఉందట. నిద్ర సరిగా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. బలహీనంగా కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాఫీని రోజుకు మితంగా తీసుకుంటే ఈ సమస్యలను దూరంగా ఉంచొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 2013లో ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్’ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, రోజుకు 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగిన వారిలో నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం 40 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
నిద్రలేమితో పాటు చికాకు, భయం కూడా కలగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కాఫీలో ఉండే కేఫీన్ శరీరంలోని కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. గుండె దడ, హృదయ స్పందన రేటులో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు నిపుణులు గుర్తించారు. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల మూత్రవిసర్జనకు ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుందని.. దీనివల్ల బాడీ డీహైడ్రేషన్ గురవుతుందని అంటున్నారు. కాబట్టి కాఫీని నాలుగు కప్పులకు మించి తీసుకోకూడదు.