Site icon vidhaatha

Supreme Court | రోహింగ్యాలు అక్రమ వలసదారులే.. శరణార్థులుగా అంగీకరించలేం.. ‘సుప్రీం’లో కేంద్రం అఫిడవిట్‌

Supreme Court | అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యా ముస్లింలకు భారత్‌లో నివసించేందుకు, స్థిరపడేందుకు ఎలాంటి ప్రాథమిక హక్కు లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. రోహింగ్యాలు అక్రమ వలసదారులని, శరణార్థులుగా అంగీకరించలేమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం.. దేశంలో స్థిరపడే ప్రాథమిక హక్కు భారతీయ పౌరులకు మాత్రమే ఉంది. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించే వారిపై విదేశీయుల చట్టంలోని నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇటీవల కేంద్రం సీఏఏ కింద మూడు దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే. రోహింగ్యాలకు సైతం పౌరసత్వం కల్పిస్తారా? అనే ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. రోహింగ్యాలకు పౌరసత్వం ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. వారు అక్రమ వలసదారులేనని చెప్పింది. రోహింగ్యాలకు పౌరసత్వం ఇచ్చే దేశం లేదని.. రోహింగ్యా ముస్లింలతో భారతదేశ అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉదని పేర్కొంది. శరణార్థులుగా భారత్‌కు వచ్చిన వారందరికీ పౌరసత్వం ఇవ్వడం సాధ్యం కాదన్న కేంద్రం.. పార్లమెంట్‌ చేసిన చట్టంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరదని అఫిడవిట్‌లో పేర్కొంది. ఆర్టికల్‌ 21 ప్రకారం.. దేశంలో విదేశీయులుగా స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉందని.. భారత పౌరులకు ఉన్న హక్కులు కల్పించడం సాధ్యం కాదని చెప్పింది.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కేంద్రం రోహింగ్యా ముస్లింలకు ఇచ్చిన గుర్తింపుకార్డులను సైతం గుర్తించడం లేదని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది. రోహింగ్యాలు భారత్‌లో స్థిరపడడం రాజ్యాంగ విరుద్ధమని.. బంగ్లాదేశ్‌ సహా పొరుగున ఉన్న దేశాల నుంచి భారీగా శరణార్థులుగా వస్తుండడంతో దేశంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని హోంశాఖ తెలిపింది. రోహింగ్యాలు ఇప్పటికే నకిలీ ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులతో ఇక్కడే సెటిల్ అయ్యారని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది. అక్రమంగా భారత్‌లోకి చొరబడిన వారిని డిటెన్షన్‌ క్యాంపుల్లో ఉంచామని.. వాటి నుంచి వారిని విడుదల చేసే ప్రసక్తే స్పష్టం చేసింది.

Exit mobile version