Site icon vidhaatha

హర్యానా ఐఎన్‌ఎల్డీ చీఫ్‌ నఫేసింగ్‌ హత్య

కారుపై ఆగంతకుల కాల్పులు.. జజ్జర్‌ వద్ద ఘటన

చండీగఢ్‌: ఇండిన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్డీ) అధ్యక్షుడు నఫే సింగ్‌ రాఠి గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో హత్యకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం హర్యానాలోని జజ్జర్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఆయనతోపాటు కారులో ప్రయాణిస్తున్న అనుచరుడు జైకిషన్‌ కూడా ఈ ఘటనలో చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రాఠి, ఆయన అనుచరులు ఒక ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న సమయంలో వేరొక కారులో వచ్చిన సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. అక్కడి నుంచి పరారయ్యాడు. కారులో ఆ సమయంలో నఫేసింగ్‌ సహా ఆరుగురు ఉన్నారు. వారందరినీ వెంటనే సమీప బ్రహ్మ శక్తి సంజీవని హాస్పిటల్‌కు తరలించారు. అయితే.. అప్పటికే నఫేసింగ్‌, జైకిషన్‌ చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. రాతి, జైకిషన్‌కు మెడ, వీపు, భుజాలపై గాయాలయ్యాయని బ్రహ్మ శక్తి సంజీవని హాస్పిటల్‌ డాక్టర్‌ మనీశ్‌ శర్మ చెప్పారు. మరో ఇద్దరికి భుజాలు, తొడలు, ఎడమవైపు ఛాతీకి బుల్లెట్లు తగిలాయిని, వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. నఫేసింగ్‌, జైకిషన్‌ హాస్పిటల్‌కు తీసుకువచ్చేలోపే చనిపోయారని, ఆయినా సీపీఆర్‌ ద్వారా బతికించేందుకు ప్రయత్నించినా వీలు కాలేదని చెప్పారు. అనేక బుల్లెట్లు తాకడంతో ప్రధాన రక్తనాళం తెగి.. అధిక రక్తస్రావం జరిగిందని, దానితో నఫేసింగ్‌ గుండె ఆగిపోయి చనిపోయారని వివరించారు. ఈ ఘటనపై తక్షణం చర్యలు తీసుకొని దర్యాప్తు చేయాలని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. ఇటీవల తనకు భద్రత కావాలని నఫేసింగ్‌ కోరారని, అయినా ప్రభుత్వం కల్పించలేదని ఐఎన్‌ఎల్డీ ప్రధాన కార్యదర్శి అభయ్‌సింగ్‌ చౌతాలా చెప్పారు. ఈ హత్యకు ప్రధాన బాధ్యత మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని ఆయన ఆరోపించారు. నఫేసింగ్‌ పార్టీలోనే కాదు.. తమ కుటుంబంలోనూ భాగస్వామి అని ఆయన చెప్పారు. ఆయన దారుణ హత్యతో తాము దిగ్భ్రాంతికి లోనయ్యామని తెలిపారు. తాను తన సోదరుడిని కోల్పోయానని వ్యాఖ్యానించారు. భద్రత కల్పించాలని కోరినప్పుడు ప్రభుత్వం రాజకీయం చేసిందని, రక్షణ కల్పించలేదని మండిపడ్డారు.  

Exit mobile version