Jubilee Hills | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం తెలంగాణ ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు తేల్చారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 3,75,430 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. చార్మినార్ నియోజకవర్గంలో అత్యల్పంగా 2,24,065 మంది ఓటర్లు ఉన్నారు. ఏ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారనే వివరాలను ఎలక్షన్ కమిషన్ తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. తమ ఓటును కూడా చెక్ చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు.
రాష్ట్రంలో 1,58,71,493 మంది పురుష ఓటర్లు, 1,58,43,339 మంది మహిళా ఓటర్లు, 2,557 మంది ట్రాన్స్‌జెండర్లు ఓటు హక్కును కలిగి ఉన్నారు. 18 నుంచి 19 ఏండ్ల మధ్య వయసున్న ఓటర్లు 8,11,640 మంది ఉన్నారు. 22 లక్షల మంది ఓటర్లను తొలగించారు.