Komatireddy Rajagopal Reddy | మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క సమక్షంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజగోపాల్ రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. బీజేపీ తరపున పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల వేళ మళ్లీ సొంత గూటికి చేరారు రాజగోపాల్ రెడ్డి.
పార్టీలో చేరుతూనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని పరోక్షంగా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చని చెప్పారు. విబేధాల్ని పక్కనబెట్టి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, రాజగోపాల్ రెడ్డి దీటైన సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు శాశ్వతం కాదని, రేవంత్ రెడ్డికి సైతం టీపీసీసీ పదవి శాశ్వతం కాదు కదా అని బదులిచ్చారు. రెండు నెలల తరువాత ఎవరైనా అధ్యక్షుడు కావచ్చన్నారు.