వైరల్ వీడియో |
దొంగలు చోరీ చేసిన డబ్బులను, ఇతర వస్తువులను భద్రంగా దాచుకుంటారు. రెండో కంటికి కనిపించకుండా ఆ నగదును, వస్తువులను కాపాడుకుంటారు. అవసరమైతే ఇతరులకు అమ్మేసి ప్రశాంతంగా ఉంటారు. కానీ ఈ దొంగలు మాత్రం చోరీకి పాల్పడి.. హీరోల్లా ఫోజులిచ్చారు. ఇంకేముంది పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఓ జ్యోతిష్యుడి ఇంట్లో ఇటీవల దొంగతనం జరిగింది. ఆ జ్యోతిష్యుడి ఇంట్లో ఉన్న నగదును, ఇతర విలువైన వస్తువులను దొంగలు అపహరించారు. దీంతో బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఇక దొంగలను వెతికే పనిలో పడ్డారు.
అయితే జ్యోతిష్యుడు తరుణ్ శర్మ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు.. ఆ నగదుతో ఇన్ స్టా రీల్స్ చేశారు. ఓ హోటల్ గదిలో బెడ్‌పై కరెన్సీ నోట్లను ఉంచి రీల్స్ చేసి, ఇన్ స్టాలో పోస్టు చేశారు. ఆ ఇన్ స్టా రీల్స్, సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా దొంగలను పట్టుకున్నారు పోలీసులు. దొంగల నుంచి రూ. 2 లక్షల నగదు, రెండు మొబైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను రిమాండ్‌కు తరలించారు.