న‌క్స‌లిజంపై మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

  • Publish Date - November 14, 2023 / 03:37 PM IST

హైద‌రాబాద్ : న‌క్స‌లిజంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నాగోల్‌లోని ఓ క‌న్వెన్ష‌న్ హాల్‌లో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. సంప‌ద పెంచాలి.. పేద‌ల‌కు పంచాలి అనేది మా సూత్రం అని ఆయ‌న పేర్కొన్నారు. అభివృద్ధి చేస్తా.. సంక్షేమం చేయ‌ను అంటే కుద‌ర‌దు. పేద‌వాడి క‌డుపు మండితే ఇదే రాష్ట్రంలో గ‌తంలో న‌క్స‌లిజం వ‌చ్చింది. రేప‌టి రోజున ఆ ప‌రిస్థితి రావొద్దు.. స‌మాజంలో అశాంతి ఉండొద్దు అంటే త‌ప్ప‌కుండా అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేయాలి. ఈ రెండు కొన‌సాగాలంటే త‌ప్ప‌కుండా దృఢ‌మైన నాయ‌క‌త్వం, స్థిర‌మైన ప్ర‌భుత్వం ఉండాలి. ఉండ‌క‌పోతే ప్ర‌తి ఆరు నెల‌ల‌కు ముఖ్య‌మంత్రి మారే ప‌రిస్థితి ఉంటే.. ప‌నులు కావు. రాష్ట్రం ఆగ‌మైత‌ది. రాష్ట్రం కుక్క‌లు చింపిన విస్త‌రిలా త‌యార‌వుతుంది.


అంద‌రం క‌ష్ట‌ప‌డి సాధించుకున్న తెలంగాణ‌ను కాపాడుకోవాలి. ఢిల్లీ నుంచి వ‌చ్చి సొల్లు పురాణానికి ఆగం కావొద్దు. వాళ్ల‌దేమో తెలంగాణ‌ను గెల‌వాల‌నే ఆలోచ‌న‌.. మ‌న‌దేమో తెలంగాణ‌ను గెలిపించాల‌న్న‌ది ఆలోచ‌న తెలంగాణ‌ను నంబ‌ర్ వ‌న్‌లో నిల‌బెట్టాల‌నేది మ‌న ల‌క్ష్యం. అధికారం ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు. కానీ మంచి చేసే నాయ‌కుల‌ను ప్రోత్స‌హించ‌క‌పోతే న‌ష్ట‌పోయేది మ‌న‌మే. ఈ ఎన్నిక‌లు తెలంగాణ రాష్ట్రాన్ని ఎవ‌రి చేతుల్లో పెట్టాల‌ని ఆలోచించి ఓటు వేసే ఎన్నిక‌లు ఇవి అని కేటీఆర్ తెలిపారు.

2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ రెండు హామీలు మాత్ర‌మే ఇచ్చింది.. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో రెండు అంశాల‌ను మాత్ర‌మే పేర్కొంది అని కేటీఆర్ గుర్తు చేశారు. ఒక‌టి ఆరు కిలోల బియ్యం, రెండోది 9 గంట‌ల క‌రెంట్ మాత్ర‌మే అని ఆయ‌న తెలిపారు. ఆ రోజు రాజ‌శేఖ్ రెడ్డిని ఓ టీవీ ఆయ‌న అడిగిండు. రెండే ముచ్చ‌ట్లు చెప్పిన‌వ్.. వేరే ఏం చెప్ప‌క‌పోతివి. పెన్ష‌న్ పెంచుత అని చెప్ప‌క‌పోతివి. రైతుల‌కు సాయం చేస్తాన‌ని చెప్ప‌క‌పోతివి. కేవ‌లం ఆరు కిలోల బియ్యం, 9 గంట‌ల క‌రెంట్ అని చెప్పారు. ఈ రెండే చెప్పిన‌వి అని అడిగితే.. ఆర్థికంగా క‌ష్టాలు వ‌స్తాయ‌ని, బ‌డ్జెట్ లేద‌ని చెప్పారు. అదే కాంగ్రెస్ పార్టీ 2023లో అది ఇది ఇస్తామ‌ని పెద్ద‌గా చెబుతున్నారు.


మ‌రి పైస‌లు యేడికెళ్లి యెల్త‌యి.. 2014 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు త‌ల‌స‌రి ఆదాయంలో నంబ‌ర్ వ‌న్ స్టేట్ తెలంగాణ‌. సంప‌ద పెంచిది కేసీఆర్.. అదే కాంగ్రెస్ పార్టీ తాను న‌డిపిన‌ప్పుడు చేత కాలేదు.. కానీ ఇవాళ కేసీఆర్ సంప‌ద పెంచిన త‌ర్వాత మేం అది ఇది ఇస్తాం అని వాగ్దానం చేస్తున్నారు. అంటే కేసీఆర్ బాగా ప‌ని చేశాడ‌ని సంప‌ద పెరిగింద‌ని ప‌రోక్షంగా ఒప్పుకున్న‌ట్టే క‌దా..? ఇక్క‌డ పెన్ష‌న్ 4 వేలు ఇస్తా అంటున్న‌ కాంగ్రెస్ పార్టీ రాజ‌స్థాన్‌, క‌ర్ణాట‌క‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎందుకు ఇస్త‌లేవు అని ప్ర‌శ్నిస్తే గ‌డుసుగా ఏ రాష్ట్రం ప‌రిస్థితి ఆ రాష్ట్రంలో ఉంట‌ది అంట‌రు. అంటే ఈ రాష్ట్రం ప‌రిస్థితి బాగున్న‌ట్టే క‌దా..? మంచిగా చేసిన కేసీఆర్ ఉన్నాక మీకు ఎందుకు ఓటేయాలి అని కాంగ్రెస్ పార్టీని కేటీఆర్ నిల‌దీశారు.

Latest News