కోహిమా : ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌ను డెంగీ వణికిస్తోంది. రెండు దశాబ్దాల తర్వాత అత్యధికంగా డెంగీ కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 2,909 డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనట్లు నాగాలాండ్ ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం వెల్లడించారు.
ఈ సందర్భంగా నాగాలాండ్ హెల్త్ మిషన్ డైరెక్టర్ ఈ మొత్సుతుంగ్ పట్టాన్ మాట్లాడుతూ.. 2005 నుంచి ఇప్పటి వరకు ఈ స్థాయిలో డెంగీ కేసులు నమోదు కాలేదన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే 8,107 శాంపిళ్లను టెస్టు చేయగా, 2,909 కేసులు డెంగీగా నిర్ధారించబడ్డాయని పేర్కొన్నారు. దిమాపూర్‌లో అత్యధికంగా 1,398 డెంగీ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.
కేసుల పెరుగుదల నేపథ్యంలో తమ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను మానిటరింగ్ చేస్తున్నారని, డెంగీ నివారణకు చర్యలు తీసుకుంటున్నారని, ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని హెల్త్ డైరెక్టర్ స్పష్టం చేశారు. డెంగీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలను అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు.