బీఆరెస్‌ను వీడనున్న నాగర్‌ కర్నూల్‌ ఎంపీ రాములు? టికెట్‌ ఎవరికంటే..

బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సాక్షిగా జరిగిన అవమానానికి రాములు ‘కారు’ దిగే సమయం వచ్చిందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

  • Publish Date - February 25, 2024 / 12:07 PM IST

  • అచ్చంపేట గులాబీ శిబిరంలో అలజడి!
  • పార్లమెంట్ సెగ్మెంట్ సన్నాహక సమావేశానికి రాములు డుమ్మా
  • అందని ఆహ్వానం.. రానని చెప్పిన ఎంపీ
  • బీఆరెస్‌లో అడుగడుగునా అవమానాలు!
  • వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ కష్టమే
  • బీఆరెస్‌ను వీడెందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న రాములు..?
  • నాగర్ కర్నూల్ టికెట్ బాలరాజుకే!

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: నాగర్ కర్నూల్ బీఆరెస్‌ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములుకు సొంత పార్టీలోనే అవమానం జరిగింది. బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సాక్షిగా జరిగిన అవమానానికి రాములు ‘కారు’ దిగే సమయం వచ్చిందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆదివారం అచ్చంపేటలో నిర్వహించిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ బీఆరెస్ సన్నాహక సమావేశం ఆ పార్టీలో అలజడికి వేదిక అయింది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి నాగర్ కర్నూల్ ఎంపీ రాములుకు ఆహ్వానం అందలేదు. రాములు లేకుండానే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ పార్లమెంట్ స్థానం మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నా సిట్టింగ్ ఎంపీ రాములు హాజరు కాలేదు. ఈ విషయాన్ని కొందరు పార్టీ నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సమావేశానికి రావాలని రాములుకు కేటీఆర్ పీఏ ఫోన్ చేశారు. ఆహ్వానం లేని సమావేశానికి రానని రాములు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయం కేటీఆర్‌కు చెప్పినా ఆయన పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. రాములు లేకుండానే సమావేశం నడిపించారు.


సన్నాహక సమావేశానికి రాములుకు సమాచారం ఇవ్వకపోవడం ద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ దక్కదనే సంకేతాలు పంపినట్టు భావిస్తున్నారు. దీంతో రాములు తీవ్ర మనస్తపానికి గురైనట్లు సమాచారం. బీఆరెస్‌లో ఉంటే తన ఉనికికే ప్రమాదం అనే ఆలోచనలో రాములు ఉన్నారని తెలుస్తున్నది. గతంలోనే నాగర్ కర్నూల్ జడ్పీ చైర్మన్‌గా తన కుమారుడు భరత్‌కు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టినా కేసీఆర్‌ పట్టించుకోలేదని సమాచారం. మొదటి నుంచీ పార్లమెంట్ నియోజకవర్గంలో రాములుకు పార్టీ పరంగా ప్రాధాన్యం కొరవడిందని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచార బాద్యతల్లో కూడా రాములు ప్రాధాన్యం లేకుండా పోయింది.


ఈ పార్లమెంట్ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లు ఉన్నాయి. వీటిలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గట్టెక్కింది. మిగతా నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇది దృష్టిలో పెట్టుకున్న బీఆర్ఎస్ అధిష్ఠానం ఇక్కడ సిట్టింగ్ ఎంపీ రాములును పక్కన పెట్టిందని అంటున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాములుకు టికెట్ ఇచ్చే ఉద్దేశంలో పార్టీ అధిష్ఠానం లేనట్లు కనిపిస్తున్నది. అందుకే అచ్చంపేట పార్టీ సన్నాహక సమావేశానికి ఆహ్వానం ఇవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ హాజరైన సమావేశానికి ఆహ్వానం లేకపోవడం.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ రాదనే భావనకు వచ్చిన రాములు బీఆర్ఎస్‌ను వీడేందుకు అవకాశం మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.


గువ్వల కేనా ఎంపీ టికెట్..?

నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ నుంచి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పోటీలో ఉండే అవకాశం కనిపిస్తోంది. అచ్చంపేట పార్లమెంట్ సన్నాహక సమావేశానికి సిట్టింగ్ ఎంపీ రాములుకు సమాచారం ఇవ్వక పోవడంలో గువ్వల హస్తం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గువ్వల సూచన మేరకే రాములును పార్టీ పక్కన బెట్టిందనే మాటలు వినిపిస్తున్నాయి. సిట్టింగ్‌ ఎంపీని కాదని గువ్వల బాలరాజును బరిలో నిలపాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నదని చెబుతున్నారు. ఇందుకు తొలి అడుగుగా ఈ సన్నాహక సమావేశంలో గువ్వలకు పార్టీ నుంచి అధిక ప్రాధాన్యం లభించిందని అంటున్నారు.

Latest News