Site icon vidhaatha

మళ్లీ భీమవరం నుంచే పోటీ.. టీడీపీ, జనసేన నేతలతో భేటీలో పవన్

విధాత, హైదరాబాద్‌ : తాను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం నుంచే పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం భీమవరం నియోజకవర్గం టీడీపీ, జనసేన పార్టీల నేతలతో పవన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన, బీజేపీలను ఏ శక్తి అపలేదన్నారు. ఈ ఎన్నికల్లో మనం గెలుస్తున్నామని, ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. జగన్ సిద్ధం అంటే మేం యుద్ధం అంటామని తేల్చి చెప్పారు.


జనసేన ఒక్కటే ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారని, ఇప్పుడు మూడు పార్టీలను ఏం చేస్తారన్నారు. వైసీపీ ఓడిపోయే పార్టీ అని జోస్యం చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పధకాలు అగిపోతాయని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. మా ప్రభుత్వం వస్తే కచ్చితంగా పథకాలు అమలవుతాయని, అభివృద్ధి జరుగుతుందన్నారు. తప్పుడు కేసులు పెట్టిన వారిని ఎవరినీ మర్చిపోమని, అన్నీ చక్కబెడతాం, సరిదిద్దుతామని పరోక్ష హెచ్చరికలు చేశారు. ప్రస్తుత కాలంలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఆశించిన ఫలితాలు ఇవ్వవన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు నాయకులు డబ్బు ఖర్చు పెట్టక తప్పడం లేదన్నారు. ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా అని ప్రశ్నించారు. భవిష్యత్ లోనైనా డబ్బు ప్రభావిత రాజకీయాలు మారితే మంచిదన్నారు.

Exit mobile version