కేసీఆర్‌ మాటలను విశ్వసించిన ప్రజలు?

ఎన్నికలు రాగానే ఆగమై ఓట్లేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్టే.. ప్రజలు ఆగం కాకుండా.. ఆలోచించి ఓటేశారు.

  • Publish Date - December 3, 2023 / 08:21 AM IST

(విధాత ప్రత్యేకం)

అవును.. మీరు చదివింది నిజమే! బీఆరెస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వందకుపైగా సభల్లో చెప్పిన మాటలను రాష్ట్ర ప్రజలు ఆలకించారు. ప్రతి సభలోనూ క్యాసెట్‌ ప్లే చేసినట్టు.. ఒకటే మాట చెబితే.. గట్టిగా విన్నారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని కేసీఆర్‌ చెబితే.. ఓటరు సరేనన్నాడు! ఆగమై ఓటేయలేదు.. నిమ్మళంగా ఆలోచించాడు.


ఓటేసే ముందు అభ్యర్థి గుణగణాలు, ఆయన వెనుక ఉన్న పార్టీల చరిత్ర చూసి ఓటేయాలన్నారు. అదీ చేశారు! చెప్పింది ఇక్కడ విని వదిలేయడం కాకుండా గ్రామాల్లోకి వెళ్లి చర్చ చేయాలని కోరారు. ఓటర్లు అదీ పాటించారు. ఊళ్లలో రచ్చబండల వద్ద చర్చలు జరిపారు. కొందరు వచ్చి లేనిపోని కథలు, అబద్ధాలు, అభాండాలు, పిచ్చి వాగ్దానాలు నోటికి అడ్డంలేకుండా చెప్తారని సీఎం చెబితే.. ఓటర్లు విన్నారు. వాటిని కేసీఆర్‌కే వర్తింపజేశారు. ఓటు వజ్రాయుధమని చెప్పారు. అవునని నిరూపించారు.


వందల మంది తెలంగాణ అమరుల త్యాగానికంటే.. తాను చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చానని చెప్పడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్బండ వర్ణాలు ఉద్యమించి తెలంగాణ తెచ్చుకుంటే.. అది తనొక్కడి ఘనతగా కేసీఆర్‌ చెప్పుకోవడాన్ని నిరసించారు. తనకు డెబ్భై ఏళ్లు వస్తున్నాయని చెబితే.. ఇక విశ్రాంతి తీసుకోమన్నారు. ఓడిస్తే ఇంటికెళ్లి రెస్టు తీసుకుంటామని కేసీఆర్‌ అంటే.. సరే.. వెళ్లి రెస్టు తీసుకోండని చెప్పారు. తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాలతో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌కు జై కొట్టారు. మార్పు కావాలని కోరుకున్న తెలంగాణ ప్రజలు.. మార్చి చూపించారు. బీఆరెస్‌ స్థానంలో కాంగ్రెస్‌ను ఎన్నుకున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్‌ విజయంలో కేసీఆర్‌ కూడా కీలక భూమిక పోషించారనుకోవాలేమో! 

Latest News