- సీట్ల సర్దుబాటుపై చర్చలు నడుస్తున్నాయి
- కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ వెల్లడి
గుమ్లా (జార్ఖండ్): పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ఇండియా కూటమిలోనే ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా మంగళవారం గుమ్లా జిల్లా బసియాలో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మమతాజీ ఇతర నేతల్లానే ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉన్నారు’ అని చెప్పారు.
సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని, అది సాధారణమేనని అన్నారు. లోక్‌సభ ఎన్నికలను బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా ఎదుర్కొంటుందని మమతాబెనర్జీ గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ను కలుపుకొని పోయే ప్రసక్తే లేదని కూడా తేల్చేశారు. పైగా బీజేపీకి సహకరించేలా కాంగ్రెస్‌తో వామపక్షాలు చేతులు కలిపాయని కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కూటమి నుంచి నితీశ్‌కుమార్ నిష్క్రమించి, మళ్లీ ఎన్డీయే పంచన చేరడాన్ని మీడియా ప్రస్తావించగా.. ఆయన ఎందుకు కూటమి నుంచి వెళ్లిపోయారో కారణాలను మీడియా సులభంగానే ఊహించవచ్చని రాహుల్ అన్నారు. బీహార్‌లో కూటమి తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు.