Site icon vidhaatha

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : దొడ్డిదోవన చండీగఢ్‌ మేయర్‌ స్థానాన్ని పొందాలని ఆశించిన బీజేపీకి భంగపాటు ఎదురైంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ఇండియా కూటమి ఐక్యతకు నిదర్శనంగా నిలిచిన ఎన్నికల్లో దుర్మార్గంతో గెలిచేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన ప్రిసైడింగ్‌ అధికారి అనిల్‌ మసైపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్యాన్ని హతమార్చడమేనని, అపహాస్యం చేయడమేనని ఘాటు వ్యాఖ్యలు చేసింది. బ్యాలెట్‌ పత్రాలను ఆయన తప్పుడు ఉద్దేశంతో దిద్దినట్టు స్పష్టంగా కనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది. ఫిబ్రవరి 7వ తేదీన జరుగాల్సిన చండీగఢ్‌ కౌన్సిల్‌ తొలి సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. హర్యానా మేయర్‌ ఎన్నిక ఫలితాన్ని నిలిపివేయాలని, ఎన్నికలను తాజాగా రిటైర్డ్‌ జడ్జి పర్యవేక్షణలో నిర్వహించేందుకు ఆదేశించాలని ఆప్‌ కౌన్సిలర్‌ కుల్దీప్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను పంజాబ్‌- హర్యానా హైకోర్టు తిరస్కరించింది. దానిని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.


ప్రిసైడింగ్‌ అధికారి బ్యాలెట్‌ పత్రాలను ట్యాంపర్‌ చేయడం వల్లే ఆప్‌-కాంగ్రెస్‌ కూటమి మేయర్‌ ఎన్నికల్లో ఓటమిపాలైందని పిటిషన్‌లో తెలిపారు. పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. ‘ప్రిసైడింగ్‌ అధికారి బ్యాలెట్‌ పత్రాలను పాడుచేసినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ఆయనను విచారించాలి. ఆయన ఎందుకు కెమెరా వైపు చూస్తున్నారు? మిస్టర్‌ సొలిసిటర్‌.. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. ఇది మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది’ అని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ఒక ప్రిసైడింగ్‌ అధికారి చేయాల్సిన పనేనా ఇది? బ్యాలెట్‌ పత్రంలో కింద క్రాస్‌ ఉంటే ఆయన దానిని పట్టించుకోలేదు. బ్యాలెట్‌ పత్రంలో పైన ఉంటే మాత్రం దానిని మార్చివేశారు. సుప్రీంకోర్టు ఆయనను గమనిస్తున్నదని ఆయనకు చెప్పండి’ అని సొసిలిటర్‌ జనరల్‌ను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో స్వచ్ఛత అనేది శిఖరాయమానం. ఇలా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడాన్ని అనుమతించరాదు’ అని అన్నారు. మేయర్‌ ఎన్నికలకు సంబంధించిన మొత్తం రికార్డులను పంజాబ్‌ – హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వద్ద భద్రపర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.


బ్యాలెట్‌ పత్రాలు, వీడియోగ్రఫీని కూడా భద్రపర్చాలని పేర్కొన్నది. రికార్డులను స్వాధీనపర్చాల్సిందిగా రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు నోటీసులు పంపాలని సీజేఐ ఆదేశించారు. వీడియోలో ఆయన ప్రవర్తనపై వివరణ ఇచ్చేందుకు ఫిబ్రవరి 19న కోర్టు ముందు హాజరుకావాలని ప్రిసైడింగ్‌ అధికారికి ఆదేశాలు జారీ చేసింది. జనవరి 30న జరిగిన చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌- ఆప్‌ కూటమిపై బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థి మనోజ్‌ సోనేకర్‌.. తన ప్రత్యర్థి, ఆప్‌ అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌పై నాలుగు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ పోలింగ్‌లో ఎనిమిది ఓట్లు చెల్లలేదని ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటించడం వివాదాస్పదమైంది. అయితే.. బ్యాలెట్‌ పత్రాలు చెల్లకుండా వాటిపై మార్కింగ్స్‌ చేస్తున్న వీడియో బయటకు రావడంతో గుట్టు రట్టయింది.

Exit mobile version