Site icon vidhaatha

సాగునీటి శాఖలో ప్రక్షాళన.. ఈఎన్సీ రాజీనామాకు ఆదేశం

విధాత‌, హైద‌రాబాద్‌: తెలంగాణ సాగునీటి పారుద‌ల శాఖ‌లో భారీ ప్ర‌క్షాళ‌న మొద‌ల‌య్యింది. ఇద్ద‌రు రిటైర్డు ఉన్న‌తాధికారుల‌పై తాజాగా వేటు వేసింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండు నెల‌లు అవుతున్నా అవినీతికి పాల్ప‌డిన ఉన్న‌తాధికారుల‌పై ఏలాంటి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని, ఇప్ప‌టికీ బిఆరెస్ నేత‌ల‌తో కొంద‌రు ఉన్న‌తాధికారులు అంట‌కాగుతున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప్ర‌భుత్వ పెద్ద‌లు మిన్న‌కుండిపోయారనే అప‌వాదు ఉంది.

ఏమైందో ఏమో కానీ సాగునీటి ప్ర‌క్షాళ‌న‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం బుధ‌వారం క‌ఠిన చ‌ర్య‌ల‌కు దిగింది. గ‌త ప‌ద‌కొండు సంవ‌త్స‌రాలుగా నిరాటంకంగా ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ, చ‌క్రం తిప్పుతున్న ముర‌ళీధ‌ర్ రావును రాజీనామా చేయాల‌ని ఆదేశించింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఇన్‌చార్జ్‌ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంక‌టేశ్వ‌రరావును స‌ర్వీసు నుంచి తొల‌గిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2013 సంవ‌త్స‌రంలో ముర‌ళీధ‌ర్ రావు ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. అప్ప‌టి ముఖ్య‌మంత్రి ఎన్‌ కిర‌ణ్ కుమార్ రెడ్డితో బంధుత్వం, స‌న్నిహిత సంబంధాల‌తో స‌ర్వీసు పొడిగించారు. 2014లో ముఖ్య‌మంత్రిగా కే చంద్ర‌శేఖ‌ర్ రావు రావ‌డంతో ఇక ఆయ‌న‌కు అడ్డు లేకుండా పోయింద‌ని నీటి పారుద‌ల శాఖ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. త‌న‌ కులానికి చెందిన వ్య‌క్తే ముఖ్య‌మంత్రి కావ‌డం ఆయ‌న‌కు క‌లిసివ‌చ్చింద‌న్నారు. ఇక అప్ప‌టి నుంచి ఆయ‌న ఆ విభాగాన్ని పూర్తిగా శాసిస్తూ త‌న క‌నుస‌న్న‌ల్లో న‌డిపించార‌న్నారు. కాళేశ్వ‌ర్ రీ డిజైన్ స‌హా అనేక ప్రాజెక్టుల‌ను తారుమారు చేసిన ఘ‌నుడంటారు. ఈఎన్సీ అడ్మిన్ హెడ్ గా ఉన్న క‌మిష‌న‌ర్ ఆఫ్ టెండ‌ర్స్ పోస్టును కూడా ముర‌ళీధ‌ర్ రావుకే కేసీఆర్‌ అప్ప‌ట్లో క‌ట్ట‌బెట్ట‌డంపై పలువురు అధికారులు లోలోన కుమిలిపోయారు. దీనివ‌ల్ల రాష్ట్రంలో అన్ని టెండ‌ర్ల‌కు ఆయ‌నే పెద్ద‌గా వ్య‌వ‌హ‌రించి, వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం లూటీకి తెర‌లేపార‌ని నీటి పారుద‌ల శాఖ ఇంజినీర్లు అప్ప‌ట్లో చ‌ర్చించుకున్నారు. స‌ర్వ పాపాల‌కు క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ ఈయ‌నే అని, వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించి క‌ఠినంగా శిక్షించాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన నాటి నుంచి డిమాండ్లు, ఒత్తిడులు పెరిగాయి. ఏమైందో ఏమో కాని ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోని ప్ర‌భుత్వం బుధ‌వారం నాడు ప్ర‌త్య‌క్ష చ‌ర్య‌ల‌కు శ్రీకారం చుట్టింది. వెంట‌నే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని హుకుం జారీ చేసింది.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఇన్ ఛార్జీ ఇంజ‌నీర్ ఇన్ చీఫ్ వెంక‌టేశ్వ‌ర రావు స్వ‌స్థ‌లం క‌రీంన‌గ‌ర్ జిల్లా మంథ‌ని. ఈయ‌న కూడా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి నాలుగైదు సంవ‌త్స‌రాలు అవుతున్న‌ది. కాంట్రాక్టు ఏజెన్సీలు చెప్పిన‌ట్లుగా న‌డుచుకున్నారు. ప్ర‌జా ధ‌నాన్ని నీళ్ల మాదిరి ఖ‌ర్చు చేసి వంద‌ల కోట్ల రూపాయ‌లు కూడ‌బెట్టుకున్నార‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈయ‌న నిర్వాకం మూలంగానే కాళేశ్వ‌రం ప్రాజెక్టు గోదావ‌రి పాల‌యింద‌న్నారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ ఓటాన్ అక్కౌంట్ స‌మావేశాల్లో నీటి పారుద‌ల శాఖ పై ఆ శాఖ మంత్రి ఎన్‌.ఉత్త‌మ్ కుమార్ రెడ్డి శ్వేత‌ప‌త్రం ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగ‌మైన‌ మెడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్న విష‌యం తెలిసిందే. మేడిగ‌డ్డ బ్యారెజిపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణకు ఆదేశించింది కూడా. అయితే కాళేశ్వ‌రం ప్రాజెక్టు పై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విచార‌ణ కు ప‌లువురు మేధావులు, సామాజిక కార్య‌క‌ర్త‌లు కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version