విధాత: 2023-24 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి.. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించింది. అనంతరం ఆమోదం తెలిపింది. బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
అయితే ఈ ఏడాది తెలంగాణ బడ్జెట్ రూ. 3 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. బడ్జెట్ ఎంత అనేది సోమవారం ఉదయం నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత బడ్జెట్ కంటే 20 శాతం అధికంగా నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 8న బడ్జెట్‌పై చర్చ చేపట్టనున్నారు. 9, 10, 11 తేదీల్లో పద్దుల పైన చర్చ జరగనుంది. వచ్చే ఆదివారం (ఈనెల 12న) సభలో ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టనుంది. అదే రోజు చర్చించి.. బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది.